Hyderabad heavy Rain : హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం - భారీగా ట్రాఫిక్‌ జామ్, రోడ్లన్నీ జలమయం

Hyderabad heavy Rain : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ఐటీ కారిడార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం పడింది.

Published on: Jun 9, 2026, 22:13:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad heavy Rain : భాగ్యనగరంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరాన్ని ముంచెత్తుతూ కురిసిన భారీ వర్షం కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్‌లో ఈ వర్షం పడటంతో నగర జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం(ANI Photo) (Mohammad Aleemuddin)
హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం(ANI Photo) (Mohammad Aleemuddin)

స్తంభించిన ఐటీ కారిడార్..

నగరంలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన జంక్షన్లలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఖైరతాబాద్‌తో పాటు సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్, మారేడ్‌పల్లి వంటి ప్రాంతాల్లో వాహనదారులు ఇళ్లకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల తెరిచి ఉన్న డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగి రోడ్లపైకి ప్రవహించడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది.

సుదీర్ఘ వేసవి కాలం తర్వాత కురిసిన ఈ భారీ వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ…. వాతావరణ శాఖ (IMD) కీలక విషయాన్ని వెల్లడించింది. మంగళవారం కురిసిన వర్షం నైరుతి రుతుపవనాల వల్ల వచ్చింది కాదని, ఇవి కేవలం రుతుపవన ముందస్తు (ప్రీ-మాన్‌సూన్) జల్లులు మాత్రమేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానిలోకి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణ దక్షిణ సరిహద్దు జిల్లాల్లోకి ప్రవేశించినప్పటికీ…. అవి ఇంకా హైదరాబాద్‌కు చేరుకోలేదు.

రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు :

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:

  • బన్సీలాల్‌పేట్: 87.3 మి.మీ
  • విఠల్‌వాడి: 78.8 మి.మీ
  • జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్, హిమాయత్‌నగర్: 78 మి.మీ
  • విద్యానగర్ (TSRTC ఎంప్లాయీస్ బిల్డింగ్): 73.5 మి.మీ
  • బౌద్ధనగర్, ముషీరాబాద్: 61.8 మి.మీ
  • తల్లాబస్తీ, ముషీరాబాద్: 60 మి.మీ
  • రూప్‌లాల్ బజార్, బహదూర్‌పురా: 58 మి.మీ
  • చందులాల్ బారాదరి: 57.8 మి.మీ
  • న్యూ మెట్టుగూడ ప్రైమరీ స్కూల్: 57.3 మి.మీ

ట్యాంక్‌బండ్‌తో పాటు.. స‌చివాల‌యం ముందు ర‌హ‌దారుల‌పై మోకాలు లోతు మేర నీరు నిలిచిపోయింది. ఈ నీటిని హైడ్రా సిబ్బంది మళ్లించేందుకు తీవ్రంగా శ్రమించింది. ట్యాంక్‌బండ్ మీద‌ సికింద్రాబాద్ వైపు వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డ‌మే కాకుండా.. చెట్టు ప‌డిపోవ‌డంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు అక్క‌డ ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. చెట్టును తొల‌గించే ప‌నుల‌తో పాటు.. వ‌ర‌ద సాఫీగా సాగేలా హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది నిమ‌గ్న‌మ‌య్యారు. క్షేత్ర‌ స్థాయిలో డీఆర్ ఎఫ్ సేవ‌లందిస్తున్నాయి. ర‌హ‌దారిపై ప‌డిన చెట్ల‌ను తొల‌గిస్తున్నారు. రోడ్ల‌పై నిలిచిపోయిన వ‌ర‌ద నీటిని పంపించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. శేరిలింగంప‌ల్లి, కొండాపూర్‌, గ‌చ్చిబౌలి, షేక్‌పేట‌, టోలిచౌకి, మాధాపూర్ ప్రాంతాల‌తో పాటు.. సికింద్రాబాద్‌, హైద‌ర్‌గూడ ప్రాంతాల్లో హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో సేవ‌లందిస్తున్నారు. దాదాపు 76 చోట్ల చెట్లు ప‌డిపోవ‌డంతో వాటిని తొల‌గించే ప‌నుల్లో హైడ్రా సిబ్బంది ఉన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More