తెలంగాణలో అతి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
మెుంథా తుపాను ప్రభావం తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాబోయే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణ అంతటా దీని ప్రభావం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

తుపాను తీరానికి చేరుకోవడంతో కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో 150-220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది ఆకస్మిక వరదలకు దారితీసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
సోమవారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక 28వ తేదీన అంటే తుపాను తీరం దాటే రోజున మంగళవారం నాడు జయశంకర్ భూపాలపల్లి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఈ జిల్లాలలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ సహా ఇతర జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 28న హైదరాబాద్‌లో గరిష్ట ప్రభావం ఉంటుందని, ఉరుములు, మెరుపులు, గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ, విద్యుత్ అంతరాయాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది.
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, అక్టోబర్ 28, 29 తేదీల్లో వర్షపాతం తీవ్రత గణనీయంగా పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. అక్టోబర్ 29, 30 తేదీల్లో మంచిర్యాల, నల్గొండ, వరంగల్, హనుమకొండ మరియు ఖమ్మంలలో అతి భారీ వర్షపాతం (115–204 మి.మీ) నమోదయ్యే అవకాశం ఉంది.
ముంథా తుపాను తీరానికి దగ్గరగా వస్తున్నందున భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, వాతావరణ అప్డేట్స్ ఫాలో కావాలని ఐఎండీ సూచించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


