సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేలాది మంది తమ స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ నెలకొంది. పాఠశాలలకు సెలవులు రావటంతో… రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నగరం నుంచి బయటకు వెళ్ళే రహదారులు రద్దీగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగళూరుకు చెందిన వేలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు. ఫలితంగా అనేక కీలక జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. నగరంలోని ప్రధాన నిష్క్రమణ మార్గాలలో ఒకటైన ఎల్బీ నగర్ లో తెల్లవారుజాము నుంచే భారీ ట్రాఫిక్ నెలకొంటోంది.
ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) వి.శ్రీనివాసులు మాట్లాడుతూ… మునుపటి సంవత్సరాల్లో కనిపించిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
"ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు అమలు చేయబడ్డాయి. అడ్డంకులను తగ్గించడానికి, రాంగ్ పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం "అని ఆయన చెప్పారు.
సంక్లిష్టమైన ప్రదేశాలలో పోలీసులు అదనపు సిబ్బందిని ఉంచుతున్నారు. అదనంగా ట్రాఫిక్ పర్యవేక్షణ బృందాలను మోహరిస్తున్నారు. వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
పండుగ రద్దీ సమయంలో అసౌకర్యాన్ని నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసు సిబ్బందికి వాహనదారాలు సహకరించాలని కోరుతున్నారు.
మరోవైపు హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరుగుతోంది.గడిచిన రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
మరోవైపు ఈ హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలతో… అధికారులు,పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.