హిల్ట్ పాలసీ కింద దరఖాస్తు చేసుకునేందుకు 3 నెలలు గడువు పెంపు!
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) కింద దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. మెుదట నెల రోజులే గడువు ఇస్తే సరిగా స్పందన రాలేదు.
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న పారిశ్రామిక భూముల వినియోగ మార్పిడికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ(HILTP) కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌ను తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 1 నుండి అక్టోబర్ 31 వరకు మూడు నెలల పాటు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో జూన్ 1 నుంచి జూన్ 30 వరకు కేవలం ఒక నెల మాత్రమే ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచారు. గడువు తక్కువగా ఉండటంతో పరిశ్రమల యజమానులు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వాలని, అలాగే జూన్ 5, 2026 కంటే ముందు అమలులో ఉన్న సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ రేట్ల ప్రకారమే రుసుములు వసూలు చేయాలని వారు కోరారు.
రాబడి సమీకరణపై జూన్ 21న నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో వాటాదారులు తమ విజ్ఞప్తులను విన్నవించారు. ప్రభుత్వం జూన్ 5 నుంచి ఎస్‌ఆర్‌ఓ రేట్లను పెంచిన నేపథ్యంలో, పాత రేట్ల ప్రకారమే ల్యాండ్ కన్వర్షన్‌కు అనుమతించాలని ప్రతిపాదించారు. పరిశ్రమ వర్గాల కోరికను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్.. జూన్ 5కి ముందున్న పాత రిజిస్ట్రేషన్ చార్జీల ప్రకారమే అక్టోబర్ 31 వరకు దరఖాస్తులను ఆమోదించాలని నిర్ణయించింది.
ఈ పొడిగించిన గడువు సమయంలో కూడా విధానంలోని మిగిలిన నిబంధనలు, నిబంధనావళి మరియు మార్గదర్శకాలు యథాతథంగా అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ని నోడల్ ఏజెన్సీగా నియమించగా, ఈ ప్రక్రియకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా TGIIC వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను చీఫ్ సెక్రటరీ ఆదేశించారు.
పారిశ్రామిక భూములను బహుళ ప్రయోజన ప్రాంతాలుగా మార్చేందుకు తీసుకొచ్చిన ఈ పాలసీ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వికాసానికి, నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


