22A Lands : 22ఏ భూముల నిబంధనలలో కీలక మార్పులు.. కొత్త జీవోతో ల్యాండ్ ఓనర్లకు ఊరట

22A Lands : 22ఏ నిషేధిత జాబితాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో భూములను నమోదు చేసే నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో భూ యజమాని హక్కులకు ఎలాంటి సమస్య ఉండదు.

Published on: Jul 22, 2026, 19:44:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో భూ హక్కుల పరిరక్షణ, వివాదాల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నిషేధిత ఆస్తుల జాబితా (22A) నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ నూతన జీఓని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

22ఏ భూములలో కీలక మార్పులు
22ఏ భూములలో కీలక మార్పులు

ఇప్పటివరకు తమ భూమి ప్రభుత్వానిది కాదని నిరూపించుకోవడానికి సామాన్య పౌరులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. తన భూమి పట్టా భూమి అని పౌరుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఏ అధికారి అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించి భూ యజమాని హక్కులకు భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

జూన్ 18, 1954 కంటే ముందు కేటాయించిన భూములను పూర్తిగా 22A నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నారు. భూముల రికార్డుల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు వెబ్‌ల్యాండ్ 2.0 వ్యవస్థను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇందులో ఎటువంటి మాన్యువల్ ఎంట్రీలకు (చేతిరాతల మార్పులకు) అవకాశం ఉండదు.

నిషేధిత జాబితా పర్యవేక్షణ ఇకపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలోనే ఉంటుంది. గ్రామ కంఠం, ప్రైవేట్ పట్టా భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ 22A లో చేర్చకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ భూమినైనా 22A లో చేర్చాలనుకుంటే ప్రజలు ఆ వివరాలు తెలుసుకునేలా పారదర్శకమైన రిజిస్టర్‌ను అందుబాటులో ఉంచుతారు.

ఏదైనా భూమి అన్యాక్రాంతమవుతోందని అత్యవసరంగా 22A లో చేర్చాలంటే.. సంబంధిత యజమానికి 30 రోజుల వ్యవధితో నోటీసు ఇచ్చి, మొత్తం ప్రక్రియను 60 రోజుల్లోగా పూర్తి చేయాలి. లేని పక్షంలో ఆ భూమి సాధారణ పట్టా భూమిగానే చెల్లుబాటు అవుతుంది. నూతన మార్గదర్శకాల ప్రకారం సాఫ్ట్‌వేర్ మార్పులను సీసీఎల్ఏ, ఐజీఆర్‌ఎస్ అధికారులు 90 రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం కాలపరిమితి విధించింది. తన భూమి ప్రభుత్వ భూమి కాదని నిరుపించుకోవాల్సిన బాధ్యత పౌరులు, భూ యజమానులపై ఉండదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More