హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఇది పూర్తైతే ట్రాఫిక్ సమస్య తప్పినట్టే!
Banjara Hills-Gachibowli Flyover : హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం మెుదలుకానుంది. బంజారాహిల్స్ ఐసీసీసీ నుండి శిల్పా లేఅవుట్ వరకు 8.75 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ రానుంది.
హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) మరొక కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ICCC) నుంచి గచ్చిబౌలి సమీపంలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ రోడ్డు వరకు 8.75 కిలోమీటర్ల నిడివితో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎమ్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,334.87 కోట్లుగా నిర్ణయించారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) టర్న్‌కీ పద్ధతిలో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సర్వే, సమగ్ర పరిశోధన, డిజైన్, కారిడార్ నిర్మాణంతో పాటు రహదారి వెడల్పు చేయడం, అవసరమైన చోట పునర్నిర్మాణ పనులను చేపడతారు. ఈ టెండర్‌లో నాలుగు లేన్ల, ఆరు లేన్ల ఎలివేటెడ్ విభాగాలు, ర్యాంపులు, కింది స్థాయిలో ఉండే రోడ్డు భాగాల కలయికకు అవకాశం ఉంది.
ఈ కారిడార్‌లో పలుచోట్ల ప్రవేశ, నిష్క్రమణ ర్యాంపుల ఏర్పాటుతో పాటు ఆరు-లేన్ల ఎలివేటెడ్ విభాగం ఉంటుంది. భవిష్యత్తులో వ్యూయింగ్ గ్యాలరీని అభివృద్ధి చేసేందుకు వీలుగా సుమారు 200 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు గల స్థలాన్ని కూడా కేటాయించారు.
వాహనాల రాకపోకలు సులభతరం చేసేందుకు ఆరు వరసల ఎలివేటెడ్ సెక్షన్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో వాహనాలు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ప్రవేశ, నిష్క్రమణ ర్యాంప్‌లను ఏర్పాటు చేస్తారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మైండ్ స్పేస్, ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి ప్రాంతాల మధ్య నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పీక్ అవర్స్‌లో ఈ మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుంటాయి. ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్ నుంచి ఐటీ హబ్ వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక వసతుల విస్తరణకు ఇది మైలురాయిగా నిలవనుంది.
ఈ భారీ ప్రాజెక్టును వర్షాకాలం, విద్యుత్, నీటి సరఫరా వంటి కరెంట్, పైప్‌లైన్ యుటిలిటీల తరలింపు ప్రక్రియతో సహా మొత్తం 24 నెలల(రెండు సంవత్సరాల) వ్యవధిలో పూర్తి చేయాలని హెచ్‌ఎమ్‌డీఏ గడువు విధించింది.
టెండర్ల ప్రక్రియకు సంబంధించి ముందస్తు అంచనాల సమీక్ష కోసం సెప్టెంబరు 22న హెచ్‌ఎమ్‌డీఏ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన కాంట్రాక్టర్లు తమ బిడ్లను దాఖలు చేయడానికి అక్టోబరు 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


