తాగునీటి దుర్వినియోగంపై ఈ నెంబర్‌కు వాట్సాప్ చేయండి.. వెంటనే కఠిన చర్యలు

Hyderabad Water Board : హైదరాబాద్‌లో తాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే.. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి కఠిన చర్యలకు దిగుతోంది.

Published on: Oct 28, 2026, 17:08:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పరిధిలో తాగునీటిని వృథా చేసిన ఓ నివాసానికి రూ.5 వేల జరిమానా విధించింది.

హైదరాబాద్ వాటర్ బోర్డు
హైదరాబాద్ వాటర్ బోర్డు

జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 57, ప్లాట్ నంబర్ 1152లో తాగునీటిని ఇంటి ప్రాంగణం శుభ్రపరిచేందుకు వినియోగిస్తున్నట్లు స్థానికులు జలమండలి వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన నేపథ్యంలో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేపట్టారు. అక్కడ తాగునీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు నిర్ధారించుకుని, సంబంధిత నివాసానికి రూ.5 వేల జరిమానా విధించారు.

ఫిర్యాదు స్వీకరణ నుంచి క్షేత్రస్థాయి విచారణ, ఉల్లంఘన నిర్ధారణ, జరిమానా విధింపు వరకు చర్యలు చేపట్టడం ద్వారా తాగునీటి దుర్వినియోగాన్ని ఉపేక్షించబోమని జలమండలి స్పష్టం చేసింది. తాగునీటిని తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే పొదుపుగా వినియోగించాలని సూచించింది. ఇంటి ప్రాంగణాలు, రోడ్లు శుభ్రపరచడం వంటి పనులకు తాగునీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.

తాగునీటి వృథా, దుర్వినియోగం ఘటనలు ఎక్కడైనా ప్రజల దృష్టికి వస్తే సంబంధిత ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామాతో జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది.

ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును పరిశీలించి, అవసరమైన క్షేత్రస్థాయి విచారణ చేపడతామని, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జలమండలి స్పష్టం చేసింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. తాగునీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటి వృథాను అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని జలమండలి కోరింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More