SIR in Telangana : ఓటరు జాబితాలో మీ పేరు లేదా..? ఈ విషయాలను తెలుసుకోండి
2002 ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, ప్రస్తుతం ఓటరుగా నమోదు కాకపోయినా ఆందోళన అవసరం లేదు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఫారమ్ 6 ద్వారా కొత్త ఓటరుగా ఎలా నమోదు చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన ఆయుధం. అయితే… చాలామంది సాంకేతిక కారణాల వల్లనో లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్లో ఓటరు జాబితాలో పేరు లేక ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో చాలా మంది ఓటర్లు… పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొంతమంది ఓటర్ లిస్టులో తమ పేరు లేదని… కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
గతంలో అంటే 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరు లేకపోయినా…. లేదా ప్రస్తుత లిస్టులో కూడా మీ పేరు నమోదు కాకపోయినా అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు సులువైన మార్గాలను అందుబాటులో ఉంచిందన్నారు.
ఫారమ్ 6తో దరఖాస్తుకు అవకాశం…
అర్హత కలిగిన ప్రతి భారతీయ పౌరుడు కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 'ఫారమ్ 6' (Form 6) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫారమ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
చాలామందికి ఎన్యూమరేషన్ ప్రక్రియ (ఓటర్ల గుర్తింపు/గణన దశ) ముగిసిన తర్వాత ఇక ఓటరుగా నమోదు చేసుకోవడం సాధ్యం కాదేమో అనే సందేహం ఉంటుంది. “ఎన్యూమరేషన్ ఫేజ్ పూర్తయిన తర్వాత కూడా అర్హులైన పౌరులు ఫారమ్ 6 లో వివరాలను నమోదు చేసుకోవచ్చు. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వీటిని అధికారులకు అందజేయవచ్చు” అని సుదర్శన్ రెడ్డి వివరించారు.
ఎస్ఐఆర్( SIR ) గడువు ముగిసిందనే భయం లేకుండా… నిబంధనల ప్రకారం ఎప్పుడైనా మీ దరఖాస్తును అధికారులకు అందజేయవచ్చు. ఇక ఓటు హక్కు ఉండి ఫామ్ రాని వాళ్లు… తల్లిదండ్రుల వివరాలను నమోదు చేసి ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
కొత్త ఓటరు నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మరింత సరళతరం చేసింది. దీనికోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్గాలు ఉన్నాయి. అర్హులైన పౌరులు నేరుగా అధికారిక ఓటర్ల సేవా పోర్టల్ (Voter Service Portal) ద్వారా లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (Voter Helpline App) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫారమ్ 6 పూర్తి చేసి అవసరమైన వయస్సు, నివాస ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేని వారు తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారిని (BLO) కలిసి భౌతికంగా ఫారమ్ 6 సమర్పించే అవకాశం కూడా ఉంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాడుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

