ఆపరేషన్ ఆక్టోపస్.. పాన్ ఇండియా సైబర్ ఫ్రాడ్ సిండికేట్‌ గుట్టురట్టు.. 104 మంది అరెస్ట్

ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు చేస్తున్న సిండికేట్‌ను గుర్తించారు. 104 మందిని అరెస్ట్ చేశారు.

Published on: Feb 24, 2026, 13:13:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా గుట్టురట్టు చేశారు. 16 రాష్ట్రాలలో 104 మంది అరెస్టు చేశారు. రూ.36 లక్షల నగదు, 200కుపైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ (సైబర్ క్రైమ్స్) అరవింద్ బాబు నాయకత్వంలో హైదరాబాద్ నగర పోలీసులు 16 రాష్ట్రాలలో సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ సిండికేట్లపై భారీ ఎత్తున దాడి చేశారు.

నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న పోన్లు, క్యాష్, స్టాంపులు
నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న పోన్లు, క్యాష్, స్టాంపులు

‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ దాడి జరిగింది. దేశవ్యాప్తంగా సైబర్ మోసాల నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడంలో ఈ ఆపరేషన్ భాగం. ఇటీవలి కాలంలో పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలకు బాధితులు బలైపోతున్న కేసులు పెరిగాయి. ఫలితంగా వారు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు. సైబర్ మోసగాళ్ళు.. బెదిరింపులు, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ.. డబ్బులను దోచుకుంటున్నారు.

పరిస్థితి తీవ్రతను గుర్తించి ఈ అక్రమ నెట్‌వర్క్‌లకు నిర్ణయాత్మక దెబ్బ కొట్టడానికి ఆపరేషన్ ఆక్టోపస్ టీమ్ ఏర్పడింది. ఇటువంటి మోసాలు పెరగడంపై దృష్టి పెట్టిన హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్(CCPS), బాధితుల నిధులను స్వాహా చేయడానికి ఉపయోగించే 151 బ్యాంకు ఖాతాల సంబంధాన్ని గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడానికి అనుభవజ్ఞులైన అధికారులతో కూడిన 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 10 రోజుల వ్యవధిలో 16 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ ఏకకాలంలో జరిగింది.

మోసాలు చేసేందుకు కీలక పాత్ర పోషించిన 104 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందులో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. మోసపూరిత ఖాతాలను తెరవడానికి సహాయపడ్డారు. మోసగాళ్లతో కుమ్మక్కైనందుకు అరెస్టు చేశారు. పట్టుబడిన వ్యక్తులు భారతదేశం అంతటా నమోదైన 1,055 సైబర్ మోసం కేసులతో సంబంధం కలిగి ఉన్నారు. వీరి మొత్తం మోసం సుమారు రూ.127 కోట్ల వరకు ఉంది. ఏమేం స్వాధీనం చేసుకున్నారంటే..

  • మొబైల్ ఫోన్లు: 204
  • సిమ్ కార్డులు: 141
  • బ్యాంక్ పాస్‌బుక్‌లు: 152
  • డెబిట్/క్రెడిట్ కార్డులు: 234
  • ల్యాప్‌టాప్‌లు: 26
  • కార్పొరేట్/సంస్థ స్టాంపులు: 56
  • స్వాధీనం చేసుకున్న నగదు: రూ.36 లక్షలు

ఈ మొత్తం ఆపరేషన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(స్పెషల్ బ్రాంచ్) ఎస్.ఎం.విజయ్ కుమార్, డీసీపీ(సైబర్ క్రైమ్స్) అరవింద్ బాబు పర్యవేక్షణలో జరిగింది. ఈ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడంలో CCPS, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది అద్భుతంగా పని చేశారు.

ఆపరేషన్ ఆక్టోపస్ అనేది నిరంతరంగా కొనసాగుతుందని, ఇలాంటి సిండికేట్లను నిర్వీర్యం చేయడానికి దర్యాప్తు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఆపరేషన్ ఆక్టోపస్ కోసం 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతిదానికీ ఒక ఇన్‌స్పెక్టర్-ర్యాంక్ అధికారి నాయకత్వం వహించారు. ఈ బృందాలను ఏకకాలంలో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ మరియు ఒడిశాలో ఉన్న సైబర్ నేరాలకు సంబంధించిన హాట్‌స్పాట్‌లలో మోహరించారు. ఆయా రాష్ట్రాల స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని అరెస్టులు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More