ఆసిఫాబాద్ అడవుల్లో ఆపరేషన్ : లొంగుబాటులో మావోయిస్ట్ అగ్రనేతలు - ఎవరీ దేవ్ జీ..?
మావోయిస్టు పార్టీ చరిత్రలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు లొంగిపోగా… మరికొందరు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. అయితే తాజాగా పార్టీకి పెద్ద దిక్కుగా భావిస్తున్న దేవ్ జీ కూడా లొంగుబాటుకు సిద్ధమయ్యారు..!
మావోయిస్టు ఉద్యమానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓవైపు ఆపరేషన్ కగార్… మరోవైపు అగ్రనేతల ఎన్ కౌంటర్లు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతుండగా…. తాజా పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. మరోవైపు కేంద్రం ప్రభుత్వం కూడా మార్చి 31వ తేదీని డెడ్ లైన్ గా చెబుతోంది. ఈ తేదీలోపు మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని హెచ్చరిస్తోంది.

తాజాగా ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ(60), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (76), మరో 16 మంది పార్టీ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ ఎస్ఐబీ ఎదుట లొంగిపోయారు. అయితే వీరి లొంగుబాటుపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత మీడియా ముందుకు ప్రవేశపెడుతారు. వీరి లొంగుబాటు ప్రక్రియను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో మావోయిస్టుల లొంగుబాటులు జరిగాయి. దేశవ్యాప్తంగా 2,793 మంది (ఒక్క బస్తర్ లోనే 1,590 మంది కార్యకర్తలు) లొంగిపోయినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.2025 లో 1,040, 2024 లో 881, 2023 లో 376 మరియు 2022 లో 496 లొంగుబాట్లు జరిగాయి.
తాజాగా తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. పార్టీ అగ్రనేతలే టార్గెట్ గా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆపరేషన్ తర్వాత…. పార్టీ అగ్రనేతలుగా ఉన్న దేవ్ జీ, రాజిరెడ్డి మరియు ఇతర మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే సమాచారాన్ని పోలీసు అధికారులకు చెరవేసినట్లు సమాచారం.
పలు రాష్ట్రాల రికార్డుల ప్రకారం… దేవ్ జీ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్నారు. ఆయన తలపై రూ .2.5 కోట్ల రివార్డు ఉంది. ఇతనే కాకుండా మరో ముఖ్య నాయుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతని తలపై రూ. 1 కోటి రివార్డు ఉంది.
దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎవరు…?
తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందినవాడు. దళిత కుటుంబానికి చెందిన తిరుపతి… 1983లో డిగ్రీని అభ్యసిస్తున్నప్పుడు … రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ABVP మరియు RSU విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు సాధారణం. ఈ సమయంలో జరిగిన పలు ఘటనలు అనేక కేసులకు దారి తీశాయి.
1983 చివరిలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కేడర్ సభ్యుడి నుంచి అంచలంచెలుగు క్రమంగా ఎదిగిన అతను చివరికి కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. మావోయిస్టు పార్టీ యొక్క పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్నారు. 2009 లో కేంద్ర కమిటీ సమావేశంలో భాగమైన తిరుపతి… అక్కడ కొత్తగా నియామకాలకు సైనిక శిక్షణా కేంద్రమైన బునియాడి కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాడు. మావోయిస్టు పార్టీ దాడులలో వ్యూహకర్తగా పేరొందాడు.
2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటనకు తిరుపతి సూత్రధారి అని రికార్డులు చెబుతున్నాయి. ఆయనపై ఎన్ఐఏ కూడా కేసులు నమోదు చేసి్ంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్జిఎ) యొక్క మొదటి సాయుధ ప్లాటూన్ ను సృష్టించిన ఘనత కూడా ఆయనకే దక్కింది.
2007 లో దంతెవాడలోని గీడం పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో కూడా తిరుపతి పాత్ర పోషించినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. దక్షిణ ఛత్తీస్ ఘడ్ తో పాటు ముఖ్యంగా బస్తర్, దంతెవాడలో అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా, వ్యూహకర్తగా భద్రతా సంస్థల రికార్డులు చెబుతున్నాయి.
ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త నియామకాలు మాత్రమే కాకుండా సైనిక శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో కూడా తిరుపతి కీలక పాత్ర పోషించినట్లు భద్రతా సంస్థలు రికార్డులు సూచిస్తున్నాయి.సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్ మరియు దేవన్నతో సహా పార్టీలో అనేక మారుపేర్లతో దేవ్ జీని పిలుస్తారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీకి దేవ్‌జీ సారధ్యం వహిస్తున్నారు.
మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా మావోయిస్టు ఉద్యమంలో అనుభవజ్ఞుడు. సాతేన్న, సాయన్న, మీసలన్న, సాగర్, అలోక్, దేశ్ పాండే, ఎస్ఎన్, లక్ష్మణ్, మురళితో సహా పలు మారుపేర్లతో పిలుస్తుంటారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సతారాజ్ పల్లి గ్రామానికి చెందినవాడు. 1975లో నక్సలైట్ ఉద్యమంలో చేరి సంస్థలో కీలక పదవులు నిర్వహించారు.
భద్రతాల బలగాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్నాయి. అడవిలోని పరిస్థితుల దృష్ట్యా… అగ్రనేతలు సైతం ఆయుధం వదలి ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించుకుంటున్నారు. కొద్ది నెలల కిందటే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీస్ ఘట్ ప్రభుత్వం ముందు ఆయుధాలను అప్పగించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

