'మిగతా మావోయిస్టులు లొంగిపోండి, నా ఫోన్ నెంబర్ ను సంప్రదించండి ' - మాజీ అగ్రనేత మల్లోజుల వీడియో సందేశం

మావోయిస్టులు లొంగిపోవాలని మాజీ మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కోరారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయి.. వారి ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. 

Published on: Nov 19, 2025, 12:35:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయని… దేశం‌ కూడా మారుతోందని అభిప్రాయపడ్డారు.

మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల
మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయని… ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు.

నన్ను సంప్రదించండి - మల్లోజుల

అడవిలో ఉన్న దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మల్లోజుల పిలుపునిచ్చారు. లొంగిపోయే దళ సభ్యులు తనను సంప్రదించొచ్చని తెలిపారు. ఈ మేరకు తన ఫోన్‌ నంబర్‌ 8856038533 ను ప్రకటించారు.

శాంతిస్థాన కోసం విజ్ఞప్తి చేసిన మల్లోజుల… మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. సమాజంలో తిరిగి కలిసిపోవాలని… కొత్త జీవితాలను ప్రారంభించడానికి ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.తాజాగా ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మల్లోజుల నుంచి వీడియో సందేశం విడుదలైనట్లు తెలిసింది.వేణు గోపాల్ వీడియోను గడ్చిరోలి పోలీసులు విడుదల చేశారు.

కొద్దిరోజులుగా మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు అగ్ర నేతలు లొంగిపోతున్నారు. ఆ పార్టీలో దశాబ్ధాలుగా పని చేస్తూ, కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి ఇటీవలనే లొంగిపోయారు. 60 మంది కార్యకర్తలతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగిన సంగతి తెలిసిందే.

మల్లోజుల వేణుగోపాల్ 1981లో తాను ఎంచుకున్న సిద్దాంతం కోసం అడవి బాట పట్టారు. మొదటగా ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో మహదేవపూర్ పోలీసులు మల్లోజులను అరెస్టు చేయగా, 1983లో విడుదల కావడంతో తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ గా పదోన్నతి లభించింది. పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ కీలకంగా మారారు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ కుటుంబ నేపథ్యం కూడా పోరాటాలకు కేరాఫ్ అనే చెప్పొచ్చు. వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తండ్రి వెంకటయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పని చేశారు. అంతేకాకుండా ఆయన సోదరుడైన మల్లోజుల కిషన్ జీ కూడా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా కొనసాగారు. 24 నవంబర్ 2011 న పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మల్లోజుల కిషన్ జీ (కోటేశ్వర్ రావు) ప్రాణాలు కోల్పోయారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More