ఆపరేషన్ కగార్ 2 : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేతలు మృతి!

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అగ్రనేతలు ఇందులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Updated on: Feb 19, 2026, 12:41:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత, కార్యదర్శి దేవ్‌జీ సహా కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు వెళ్లాయి. అగ్రనేతల కోసం 'ఆపరేషన్ కగార్-2'లో భాగంగా కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్
కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్

ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేతలు ఉన్నట్టుగా సమాచారం. ఆపరేషన్ కగార్ 2 పేరుతో కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్ర నేతలే టార్గెట్‌గా ఆపరేషన్ కగార్ 2 నడుస్తోంది. ఆపరేషన్ కగార్‌ డెడ్‌లైన్ ఇంకా 40 రోజులే మిగిలి ఉంది. దీంతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ చేస్తున్నాయి. 2 వేలకు పైగానే బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

నక్సలిజాన్ని మార్చిలోపు అంతం చేయాలనే కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వేట కొనసాగుతోంది. అందులో భాగంగానే కర్రెగుట్టలు హిల్స్ 2ను బలగాలు ప్రారంభించాయి. మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అగ్రనేతలే టార్గెట్‌గా బలగాలకు ఆదేశాలు వెళ్లాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జీ కేసా సోది కోసం కర్రెగుట్టల్లో బలగాలు వేట కొనసాగిస్తున్నాయి.

కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో బలగాలు ముందుకుసాగాయి. మావోయిలు ఎదురుపడటంతో కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోయాయి. ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను బలగాలు గుర్తించాయి. మృతుల్లో అగ్రనేతలు ఉన్నారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

కొంతకాలంగా ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు బలగాలు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్రనేతలను పార్టీ కోల్పోయింది. ఎన్‌కౌంటర్‌లో కొందరు మరణించగా.. మరికొందరు లొంగిపోయారు. దీంతో మావోయిస్టులు తలదాచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారనే సమాచారంతో బలగాలు కూంబింగ్ చేస్తుండగా ఎన్‍కౌంటర్ జరిగింది.

మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ కగార్ గడువు ముగియనుంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావులాంటివారు ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతంలోనే ఉన్నారని బలగాలు జల్లెడ పడుతున్నాయి. మరణించిన ఐదుగురు మావోయిస్టుల గుర్తింపు తెలియాల్సి ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆయుధాలు, విప్లవ సాహిత్యం దొరికినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 15 మంది వరకు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More