PAANI APP : హైదరాబాద్ వాటర్ బోర్డు పానీ యాప్‌.. ఇది ఎందుకోసం అంటే?

హైదరాబాద్ వాటర్ బోర్డు పానీ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా ప్రజలు తమ ప్రాంతాల్లో తాగునీటి వృథా, దుర్వినియోగంపై ఫిర్యాదు చేయవచ్చు.

Published on: Oct 30, 2026, 06:04:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ జలమండలి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల నీటి లభ్యతపై ఆందోళనల నేపథ్యంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని నివారించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) పానీ మెుబైల్ యాప్‌ను ప్రారంభించింది. అంతేకాదు ప్రజలు తమ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని కోరింది. జలమండలి ప్రధాన కార్యాలయంలో పానీ యాప్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ,ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

పానీ యాప్ లాంచ్
పానీ యాప్ లాంచ్

పానీ యాప్ ద్వారా హైదరాబాద్ నివాసితులు తమ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న తాగునీటి వృథా, దుర్వినియోగంపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న పౌరులు గుర్తింపు పత్రాన్ని సమర్పించడం ద్వారా వాటర్ బోర్డ్ వెబ్‌సైట్ ద్వారా సేవ్ వాటర్ వాలంటీర్స్‌గా నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు ధృవీకరించిన తర్వాత అధికారికంగా వాలంటీర్లుగా గుర్తించబడతారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

యాప్ ద్వారా సమర్పించిన ప్రతి ఫిర్యాదు ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ ద్వారా ఉంటుంది. ఆ తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తారు. ఫిర్యాదులు చేసే వాలంటీర్ల గుర్తింపు గోప్యంగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. నీటి దుర్వినియోగం నిజంగానే జరిగితే.. సంబంధిత వ్యక్తులకు లేదా సంస్థలకు నోటీసులు జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తారు.

నీటి సంరక్షణకు కృషి చేసే వాలంటీర్లను ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై అత్యుత్తమ వాలంటీర్లను అభినందిస్తారని, నివాస కాలనీలు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, ఇతర పరిసర ప్రాంతాల నుండి కూడా భాగస్వామ్యం కావాలని బోర్డు ప్రోత్సహిస్తోందని అధికారులు తెలిపారు.

వాహనాలు, నేలలను కడగడానికి తాగునీటిని ఉపయోగించవద్దని హైదరాబాద్ వాటర్ బోర్డు హైదరాబాద్ వాసులకు సూచించింది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు పొంగిపొర్లకుండా చూసుకోవాలని, లీకులను వెంటనే మరమ్మతు చేయాలని తెలిపింది. అలాగే ఇళ్లు, భవనాలలో ఇంకుడు గుంతలు, వర్షపునీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

తాగునీటిని అనవసరమైన కార్యకలాపాల కోసం వాడకూడదని బోర్డు తెలిపింది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల నుండి శుద్ధి చేసిన మురుగునీటిని పార్కులు, తోటలకు నీరు పెట్టడానికి, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణం, పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. ఇటువంటి అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీటి వినియోగాన్ని సులభతరం చేయడానికి హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More