HYDRAA Alert : మీ ఏరియాలో పాత భవనాలున్నాయా..? వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
శిథిలావస్థలో ఉన్న భవనాలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రమాదకరంగా ఉన్న కట్టడాల సమాచారాన్ని 9000113667 నంబర్‌కు చేరవేయాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.
హైదరాబాద్ నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, పాత కట్టడాల వల్ల ఎదురయ్యే ప్రాణనష్టాన్ని నివారించేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడైనా కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటువంటి ప్రమాదకర కట్టడాల సమాచారాన్ని వెంటనే తమకు అందించాలని కోరుతూ…. 9000113667 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది.

బుధవారం సాయంత్రం బెంగళూరులోని శివాజీనగర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి ఒక ఆసుపత్రి సమీపంలో ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా…. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో కూడా గతంలో ఇటువంటి పాత భవనాలు కూలి అమాయకులు బలిని తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, అకాల వర్షాలు కురుస్తున్న వేళ నగరంలో మరోసారి అలాంటి విషాదాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో హైడ్రా రంగంలోకి దిగింది.
సమాచారం ఎలా అందించాలంటే…?
మీ పరిసరాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత భవనాలు, గోడలు లేదా ఇతర నిర్మాణాలు కనిపిస్తే, వెంటనే వాటిని గుర్తించి అధికారులకు ఫోన్ చేయవచ్చు. సమాచారం ఇచ్చేటప్పుడు కింది వివరాలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు:
- ప్రమాదకరంగా ఉన్న ఆ భవనం లేదా కట్టడం ఫొటో తీయాలి.
- ఆ ప్రాంతం ఎక్కడ ఉందో తెలిపే 'కరెంట్ లొకేషన్'ను వాట్సాప్ చేయాలి.
- సమాచారం అందించిన వారి వివరాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచుతారు.
- కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని హైడ్రా కోరుతోంది.
సాధారణంగా ప్రజలు వర్షాకాలంలోనే భవనాలు కూలుతాయని భావిస్తుంటారు. అయితే…. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కురుస్తున్న అకాల వర్షాల వల్ల కూడా పాత కట్టడాల గోడలు నాని బలహీనపడే అవకాశం ఉంటుంది. "ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో చెప్పలేం, కాబట్టి వర్షాకాలం వరకు వేచి ఉండకుండా ముందస్తుగా సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం" అని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి శిథిలావస్థలో ఉన్న భవనాల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటే వేగంగా స్పందించి ప్రమాదాలను నివారించవచ్చని వారు పేర్కొంటున్నారు. పురాతన భవనాలను ముందే గుర్తించి… వాటిని శాస్త్రీయ పద్ధతిలో కూల్చివేయడం ద్వారా నగర ప్రజల భద్రతను నిర్ధారిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

