ఏ మేయర్ పీఠం ఎవరికి దక్కింది? 7 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు వీరే

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎంతో ఆసక్తిని పెంచాయి. 7 కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎవరు అనే జాబితాను తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published on: Feb 16, 2026 8:26 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్మన్లపై ఆసక్తి నెలకొంది. ఇక 7 కార్పొరేషన్లలో ఎవరు మేయర్ పీఠాలపై కూర్చుంటారా? అనే క్యూరియాసిటీ అందరికి ఉంది. ఇక కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. చివరకు కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేసింది. మిగిలినవాటిలో ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్ కూర్చొంది. కొత్తగూడంలో మాత్రం సీపీఐ తెరపైకి వచ్చి మేయర్ స్థానాన్ని దక్కించుకుంది.

7 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల లిస్ట్
7 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల లిస్ట్

రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారి జాబితాను ప్రకటించింది. ఐదు మేయర్ పదవులు కాంగ్రెస్‌కు దక్కగా, భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఒక్కొక్కటి చొప్పున మేయర్ పదవులు దక్కించుకున్నాయి. డిప్యూటీ మేయర్ పదవులకు కాంగ్రెస్ నుంచి ఐదుగురు అభ్యర్థులు విజేతలుగా ప్రకటించగా. బీజేపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ( AIMIM ) ఒక్కొక్క పదవిని గెలుచుకున్నాయి. భారత రాష్ట్ర సమితి అసలు కార్పొరేషన్‌లలో ఏ రేసులోనూ లేకుండా పోయింది.

మేయర్లు, డిప్యూటీ మేయర్లు వీరే

  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నికయ్యారు.
  • నిజామాబాద్‌లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ కలిసి కార్పొరేషన్‌లో ఉమారాణిని మేయర్‌ను చేశాయి. డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ ఉన్నారు.
  • రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌ను హస్తం పార్టీ సొంతం చేసుకుంది. మహంకాళి స్వామి మేయర్‌గా, పాతిపెల్లి ఎల్లయ్య డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
  • కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. మేయర్‌గా మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్‌గా సిరిపురపు లలిత కుమారి ఎంపికయ్యారు.
  • నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. బుర్చి చైతన్యరెడ్డి మేయర్, మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్‌ను డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్నారు.
  • మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుమల్ మమత మేయర్‌గా, సురేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
  • మంచిర్యాల కార్పొరేషన్‌లో హస్తం పార్టీ జెండా ఎగురవేసింది. మేయర్‌గా మధుకర్, డిప్యూటీ మేయర్‌గా రమ్య మహేశ్‌గా గెలిచారు.

11 మున్సిపాలిటీల్లో వాయిదా

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం.. 11 మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్‌, వైస్ ఛైర్మన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు మంగళవారం(ఫిబ్రవరి 17) జరుగుతాయి. ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీలు ఇవే.. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, తొర్రూర్, జనగాం ఉన్నాయి. మంగళవారం ఈ 11 మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.

24 ఏళ్లకే మున్సిపల్ ఛైర్మన్

కొన్ని మున్సిపాలిటీల్లో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో 24 సంవత్సరాలకే మున్సిపల్ ఛైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు గడ్డం అనన్య ఎన్నికయ్యారు. అసలు రేసులోనే లేరు అనుకున్న స్వతంత్ర అభ్యర్థులు ఛైర్ పర్సన్లుగా ఎన్నికయ్యారు. బైంసా మున్సిపాలిటీలో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, స్వతంత్రుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి తూమెల్ల దత్తాత్రి ఛైర్మన్‌గా, ఖతుజా సిద్ధికి వైస్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ ఇండిపెండెంట్లుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ సీట్లలో కూర్చున్నారు.