తెలంగాణ : అమ్మాయిలకు ఫ్రీగా హెచ్‌పీవీ వ్యాక్సిన్.. ఇది ఎందుకు వేయించుకోవాలి?

గర్భాశయ క్యాన్సర్(Cervical Cancer)ను ముందుగానే అరికట్టేందుకు ఇచ్చే హెచ్‌పీవీ టీకాను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. 14, 15 ఏళ్ల వయసులో టీకా వేయిస్తే ఉత్తమ రక్షణ లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Published on: Feb 16, 2026 6:33 PM IST
By , Telangana
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, టీకా మోతాదులను నిల్వ చేయడం వంటి సన్నాహాలను రాష్ట్రం పూర్తి చేసింది. ఫిబ్రవరి చివరి నాటికి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

అమ్మాయిలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ (Unsplash)
అమ్మాయిలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ (Unsplash)

కిందిస్థాయిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా అమలు జరిగేలా చూసుకోవడానికి ఆరోగ్య శాఖ రాష్ట్రం అంతటా 1,200 నుండి 1,500 మంది ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చింది. ఈ సిబ్బంది పీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ను అందించడం, రోగనిరోధక సెషన్‌లను నిర్వహించడంలాంటివి చూసుకుంటారు.

4.6 లక్షల మందికి!

ఇందులో బాగంగా 4.6 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. తెలంగాణ అంతటా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రజారోగ్య ప్రాంతాల్లో 14, 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తారు.

బయట అధిక ఖర్చు

హెచ్‌పీవీ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ను నుండి రక్షణను అందించేందుకు సాయపడుతుంది. పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్ నుంచి అమ్మాయిలను కాపాడేందుకు ఈ చర్య ముఖ్యమని ఆరోగ్య అధికారులు తెలిపారు. బయట ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే.. సాధారణంగా మోతాదుకు రూ.6,000-రూ.12,000 మధ్య ఖర్చవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.

తెలంగాణలో పరిస్థితి ఇలా

తెలంగాణలో గర్భాశయ క్యాన్సర్ కేసులు, సంబంధిత మరణాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఫిబ్రవరి 13, 2026న లోక్‌సభలో పంచుకున్న డేటా ప్రకారం.., 2021లో రాష్ట్రంలో 3,169 గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇది 2022లో 3,185, 2023లో 3,201, 2024లో 3,217, 2025లో 3,233కి పెరిగింది.

గర్భాశయ క్యాన్సర్ మరణాలు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నాయి. తెలంగాణలో 2021లో 1,711 మరణాలు, ఆ తర్వాత 2022లో 1,720, 2023లో 1,729, 2024లో 1,737, 2025లో 1,746 మరణాలు నమోదయ్యాయని డేటా చెబుతోంది.

ఎందుకు ఈ వ్యాక్సిన్ ముఖ్యం?

15 ఏళ్ల వయసున్న అమ్మాయిల తల్లిదండ్రులు తప్పకుండా ఈ విషయంపై అలర్ట్‌గా ఉండాలి. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించనుంది. సుమారు 85 నుంచి 90 శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు హెచ్‌పీవీ వల్లే వస్తాయి. 14-15 ఏళ్ల వయసులో వేయిస్తే ఉత్తమ రక్షణ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. 'మీ కుమార్తె భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి. అపోహలు నమ్మవద్దు-ఇది సురక్షితమైన మరియు శాస్త్రీయంగా నిరూపితమైన టీకా.' అని ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More