ఉత్తర తెలంగాణవ్యాప్తంగా సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత అగ్నికీలలను తలపిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ఏకంగా 244 మండలాలు తీవ్రమైన వేడి గాలలు ప్రభావంతో ఉడికిపోయాయి. శుక్రవారం నమోదైన గణాంకాల ప్రకారం సూర్యాపేట జిల్లా అత్యధికంగా 22 మండలాల్లో వడగాలుల బారిన పడింది.

శుక్రవారంనాడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.2 నుండి 46.5 డిగ్రీల మధ్య నమోదై ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో వడదెబ్బతో వివిధ ప్రాంతాల్లో మెుత్తం 34 మంది మరణించారు.
రాత్రి పూట కూడా ఉక్కపోత
సాధారణంగా ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా, సూర్యాస్తమయం తర్వాత చల్లటి గాలులు వీచి కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. గాలిలో తేమ శాతం దారుణంగా పడిపోవడంతో రాత్రి వేళల్లో కూడా వేడి సెగలు తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో రాత్రి వేళ సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి.
వాతావరణ శాఖ రాబోయే నాలుగు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శనివారం నాడు ఏకంగా 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ధాన జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఆదివారం 7 జిల్లాలు, సోమవారం 10 జిల్లాలు, మంగళవారం మరో 7 జిల్లాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతుందని అంచనా వేశారు.
జాగ్రత్తలు
వడదెబ్బ తగలకుండా: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. తప్పనిసరైతే గొడుగు, టోపీ, కాటన్ రుమాలు ధరించాలి.
{{/usCountry}}వడదెబ్బ తగలకుండా: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. తప్పనిసరైతే గొడుగు, టోపీ, కాటన్ రుమాలు ధరించాలి.
{{/usCountry}}శరీరాన్ని హైడ్రేట్ చేసుకోండి: దాహం వేయకపోయినా ప్రతి గంటకు నీరు తాగాలి. ఓఆర్ఎస్ (ORS), నీరు, మజ్జిగ, కొబ్బరిబొండాలు, నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలో లవణాల శాతం పడిపోకుండా ఉంటుంది.
ఆహార నియమాలు: వేసవిలో త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. నిల్వ ఉంచిన పదార్థాలు, మసాలాలు, కెఫిన్ (టీ, కాఫీ) ఎక్కువగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి.
చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్త: ఇంట్లోని చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ ఉష్ణోగ్రతలకు త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.