మండుతున్న తెలంగాణ.. భానుడి భగభగలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలో ఎండవేడి విపరీతంగా ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం అనేక జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Published on: May 23, 2026, 05:36:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉత్తర తెలంగాణవ్యాప్తంగా సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత అగ్నికీలలను తలపిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ఏకంగా 244 మండలాలు తీవ్రమైన వేడి గాలలు ప్రభావంతో ఉడికిపోయాయి. శుక్రవారం నమోదైన గణాంకాల ప్రకారం సూర్యాపేట జిల్లా అత్యధికంగా 22 మండలాల్లో వడగాలుల బారిన పడింది.

తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

శుక్రవారంనాడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.2 నుండి 46.5 డిగ్రీల మధ్య నమోదై ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో వడదెబ్బతో వివిధ ప్రాంతాల్లో మెుత్తం 34 మంది మరణించారు.

రాత్రి పూట కూడా ఉక్కపోత

సాధారణంగా ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా, సూర్యాస్తమయం తర్వాత చల్లటి గాలులు వీచి కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. గాలిలో తేమ శాతం దారుణంగా పడిపోవడంతో రాత్రి వేళల్లో కూడా వేడి సెగలు తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో రాత్రి వేళ సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి.

వాతావరణ శాఖ రాబోయే నాలుగు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శనివారం నాడు ఏకంగా 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ధాన జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఆదివారం 7 జిల్లాలు, సోమవారం 10 జిల్లాలు, మంగళవారం మరో 7 జిల్లాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతుందని అంచనా వేశారు.

జాగ్రత్తలు

వడదెబ్బ తగలకుండా: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. తప్పనిసరైతే గొడుగు, టోపీ, కాటన్ రుమాలు ధరించాలి.

శరీరాన్ని హైడ్రేట్ చేసుకోండి: దాహం వేయకపోయినా ప్రతి గంటకు నీరు తాగాలి. ఓఆర్ఎస్ (ORS), నీరు, మజ్జిగ, కొబ్బరిబొండాలు, నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలో లవణాల శాతం పడిపోకుండా ఉంటుంది.

ఆహార నియమాలు: వేసవిలో త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. నిల్వ ఉంచిన పదార్థాలు, మసాలాలు, కెఫిన్ (టీ, కాఫీ) ఎక్కువగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి.

చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్త: ఇంట్లోని చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ ఉష్ణోగ్రతలకు త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More