తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది.. నేనే అంతటా తిరుగుతా : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై సంచల కామెంట్స్ చేశారు. తానూ చెరువులో భూమి కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే.. స్వచ్ఛందంగా ప్రభుత్వానికి రాసి ఇస్తా అన్నారు.

Published on: Jun 2, 2026, 16:55:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన తాటాకు చప్పుళ్లకు భయపడదని చెప్పారు. తనకు ఉన్న భూమి కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇస్తానని ప్రకటించారు. చెరువులో భూమి కబ్జా చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గద్దర్ గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

‘తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేస్తాం.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. ఇకపై ఇలానే మాట్లాడుతా.. తెలంగాణ దేశంలో అంతర్భాగం.’ అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ప్రజా గాయకుడు గద్దర్ బతికున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఎక్కడున్నారని పవన్ ప్రశ్నించారు. గద్దర్ అడిగిన రెండు రోజుల్లోనే తాను సొంత డబ్బులతో బండి కొనిచ్చానని గుర్తు చేశారు. అలాగే విభజన తీరును మాత్రమే తాను తప్పుబట్టానని, తెలంగాణ ఉద్యమానికి తాను వ్యతిరేకం కాదన్నారు.

'ఈ మధ్య కాలంలో కొందరు నన్ను హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావ్? నీకు ఇక్కడ ఏం పని? అని ప్రశ్నిస్తున్నారు. నన్ను బెదిరించడానికి తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?' అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి ఖాళీ బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో తనకు బెదిరింపులు తక్కువేనని, ఇక్కడి యువత భవిష్యత్తు బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తిని తానేనని చెప్పారు.

తమ పార్టీ జనసేనను తెలంగాణ గడ్డపైనే స్థాపించామని గుర్తు చేస్తూ.. ఏపీలో తాను పర్యటించడానికి వారాహి వాహనానికి తొలి అనుమతి ఇచ్చింది కూడా తెలంగాణ ప్రజలేనని, వారి అండదండలు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని పవన్ భావోద్వేగంగా మాట్లాడారు.

తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని పార్టీ నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారని పవన్ తెలిపారు. ఆంధ్రాలోనే పదవులు, అధికారం ఆశించని వాడిని.. తెలంగాణలో అధికారం కోసం ఎందుకు ఆరాటపడతాను? నాకు సీట్లపై ప్రేమ లేదు, సమాజంలో మార్పు రావడం మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీలో ముఖ్యమంత్రికి దిక్కులేదని, తెలంగాణలో ఏముంటుందని అన్నారు.

తెలంగాణ ప్రజల మనస్సు చాలా విశాలమైనదని, వారికి ఏపీ ప్రజలపై ఎలాంటి ద్వేషం లేదని ఆయన అన్నారు. ఒకవేళ ఇక్కడి ప్రజలు విద్వేషం పెంచుకుంటే ఏపీకి చెందిన ఒక్క వ్యక్తి కూడా హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉండలేకపోయేవారన్నారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న నేతలు కనీసం ఆదిలాబాద్ అడవుల్లో కూడా తిరిగి ఉండరని, తాను తెలంగాణ నలుమూలలా తిరిగిన వ్యక్తినని పవన్ గుర్తు చేశారు.

ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలా వద్దా అనే విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ, విమర్శకుల పుణ్యమా అని ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. కేవలం పోటీ చేయడమే కాకుండా, తానే స్వయంగా తెలంగాణ అంతటా పర్యటించి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇక్కడి ప్రతి అన్యాయాన్ని ఎదిరిస్తానని, తెలంగాణ కూడా భారతదేశంలో భాగమేనని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.

తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. 'నేను చెరువును ఆక్రమించుకున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. నేను సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాను.. విచారణ జరిపించండి. నేను కబ్జా చేసినట్లు ఒక్క రూపాయి భూమి నిరూపితమైనా, దాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.' అని పవన్ పేర్కొన్నారు.

గతంలో మర్రి చెన్నారెడ్డి చొరవ వల్లే సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు వచ్చిందని, హైదరాబాద్ 50 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా సేవలందించిందని చెప్పారు. పాలకుల తప్పులకు ప్రజలను బాధ్యులను చేయవద్దని, ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు దెబ్బతినేలా మాట్లాడే విశ్లేషకుల వల్లే కమ్యూనిజం అంతరించిపోయిందని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More