...
...
Next Story

జూబ్లీహిల్స్ బై పోల్ ప్రచార మైకులు బంద్.. ఇక మిగిలింది పోలింగ్, ఫలితాలే!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. కొన్ని రోజులు హోరాహోరీగా ప్రచారం చేసిన పార్టీలు మైకులు బంద్ చేశాయి. ఇక పోలింగ్, ఫలితాలు మిగిలి ఉన్నాయి.

Published on: Nov 9, 2025, 17:16:01 IST
Advertisement

కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మెుత్తం ప్రచారంతో హీటెక్కింది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేశాయి. ఏ వీధిలో చూసినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ జెండాలతో నేతలు ప్రచారంతో ఊపు తెచ్చారు. ఇక ఎన్నికల సంఘం పెట్టిన గడువు ప్రకారం 5 గంటలు ప్రచారం ముగిసింది. దీంతో మైకులు అన్ని బంద్ అయ్యాయి.

ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం
ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం

ప్రచార గడువు నవంబర్ 9 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకే. దీంతో కాలనీలు, బస్తీలు, వీధుల్లో గుమిగూడిన రాజకీయ నాయకులు ఇప్పుడు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇరుకైన సందుల్లో మోగిన మైకుల చప్పుడు వినిపించడం లేదు, సందర్శించే నాయకులు కనిపించడం లేదు. ఇంటింటికి సందర్శనలు, పార్టీ కార్యకర్తలతో కోలాహలంగా కనిపించిన జూబ్లీహిల్స్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది.

రోడ్‌షోలు, పార్టీ అగ్ర నాయకుల ప్రసంగాలు, పార్టీల మధ్య బల ప్రదర్శన సాయంత్రం 5 గంటలతో అయిపోయింది. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పుడు ఆంక్షలు మొదలు అయ్యాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వచ్చింది. ఆయన భార్య మాగంటి సునీత కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. మరో 55 మంది అభ్యర్థులు కూడా పోటీలో నిలిచారు. మెుత్తం 401365 ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన కేంద్రాల్లో భద్రతను పెంచుతారు. డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రచారం ముగియడంతో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.

ఉప ఎన్నిక నేపథ్యంలో ఈనెల 11న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ ముందురోజు ఈ నెల 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు, ఆఫీసులకు మాత్రమే సెలవు ఇవ్వగా.. పోలింగ్ రోజు 11వ తేదీన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆఫీసులకు, సంస్థలకు సెలవు ఇచ్చారు.

14వ తేదీన కౌంటింగ్ నాడు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట మాత్రమే సెలవు ఉంటుంది. ఆయా చోట్ల పనిచేసే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe