...
...
Next Story

Cheyutha Pensions : తెలంగాణలో కొత్త పెన్షన్లపై కీలక అప్డేట్.. డెడ్‌లైన్ పెట్టిన ప్రభుత్వం!

Cheyutha Pension Update : చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద నూతన పెన్షన్లను మంజూరు చేయడానికి తెలంగాణ సర్కార్ చర్యలు ప్రారంభించింది. అయితే అప్లై చేయడానికి డెడ్‌లైన్ పెట్టింది ప్రభుత్వం.

Updated on: Aug 11, 2026, 18:52:38 IST
Advertisement

తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లికేషన్ చేయడానికి దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ లేదని మెుదట ప్రచారం జరిగింది. కానీ తాజాగా ప్రభుత్వం దరఖాస్తుకు డెడ్‌లైన్ విధించింది. ఇతర విషయాల్లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి విడతలో భాగంగా కింది కేటగిరీలకు చెంది అర్హత ఉన్న లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నారు.

చేయూత పెన్షన్లపై అప్డేట్
చేయూత పెన్షన్లపై అప్డేట్

ఒంటరి మహిళలు, వితంతు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫిలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు పెన్షన్ రానుంది..

కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అర్హత నిబంధనల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న నిబంధనలనే అనుసరిస్తోంది. 2014 నుండి 2018 మధ్య కాలంలో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రాతిపదికన మాత్రమే లబ్ధిదారుల అర్హతలను నిర్ధారిస్తారు.

ప్రజా పాలన కార్యక్రమాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కాగితాలు సమర్పించని వారు, అలాగే ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన పౌరులు తాజాగా అప్లై చేసుకోవచ్చు.

అర్హతను సరి చూసేందుకు ఆయా శాఖల నుంచి అవసరమైన సర్టిఫికెట్లను పొందే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

కావాల్సిన పత్రాలు

వితంతు మహిళలు : భర్త మరణ ధృవీకరణ పత్రం.

ఒంటరి మహిళలు: విడాకులు/విడిపోయినట్లు పత్రం లేదా స్థానిక విచారణ నివేదిక.

చేనేత కార్మికులు: చేనేత, జౌళి శాఖ సర్టిఫికెట్.

ఫైలేరియా బాధితులు: వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రం.

పరిశీలన, ఎంపిక ప్రక్రియ

వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపడతారు. అర్హులైన వారి జాబితాను జిల్లా స్థాయికి పంపి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పెన్షన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి తోడు, అర్హులైన ప్రతి ఒంటరి మహిళ, వితంతు దరఖాస్తు చేసుకోవడంలో, సర్టిఫికెట్లు పొందడంలో సహాయం చేయాలని స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు బాధ్యతలు అప్పగించారు.

కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆగస్టు 31, 2026 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు వివరాలను తక్షణమే చేయూత పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe