AP Pensions : ఏపీ ప్రజలకు అలర్ట్ - ఈ జిల్లాల్లో 2 రోజుల ముందుగానే పెన్షన్ల పంపిణీ..! ఇవిగో వివరాలు

AP NTR Bharosa Pensions : ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం ఉంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో జూలై 30నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Published on: Jul 24, 2026, 14:01:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP NTR Bharosa Pensions : ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే సామాజిక పింఛన్లను ఈసారి రెండు రోజుల ముందే పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ప్రతిష్టాత్మక అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ భారీ కార్యక్రమం దృష్ట్యా ప్రజలకు, అధికార యంత్రాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పెన్షన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
పెన్షన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఈ మేరకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జూలై 30వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సొమ్మును అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా వివరాలు…

ఈ ముందస్తు పంపిణీ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. వీరి కోసం ప్రభుత్వం రూ. 514.42 కోట్ల నిధులను కేటాయించింది. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా, సజావుగా సాగేందుకు వీలుగా జూలై 29 నాడే బ్యాంకులనుంచి అవసరమైన నగదు ఉపసంహరణ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రితో పాటు అనేకమంది ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్, ఇతర ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉంటారు. అందుకే పెన్షన్ల పంపిణీకి ఎలాంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి జూలై 30నే పంపిణీ శాతాన్ని వంద శాతానికి తీసుకెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని…. ఎంత పెద్ద కార్యక్రమం ఉన్నా లబ్ధిదారులకు అందాల్సిన ఆర్థిక సాయం సకాలంలో అందాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More