ఆగస్టు 1 నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏపీఎస్‌ఆర్‌టీసీ 20 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

APSRTC E Buses : ఆగస్టు 1న ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచనుంది ఏపీఎస్ఆర్టీసీ. 20 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.

Published on: Jul 20, 2026, 14:58:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) సిద్ధమైంది. విమానాశ్రయానికి మెరుగైన ప్రజా రవాణా సదుపాయం కల్పించే లక్ష్యంతో ఆగస్టు 1న 20 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు విశాఖపట్నం ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు వెల్లడించారు.

ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు

పథకం ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 7 విద్యుత్ బస్సులు విశాఖ నగరానికి చేరుకోగా, మిగిలిన 13 బస్సులు జూలై 25 నాటికి రానున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఈ-బస్సులను ప్రారంభించనున్నారు.

ప్రయాణికులకు సులభమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆర్టీసీ రెండు ప్రత్యేక రూట్లను ఖరారు చేసింది:

రూట్ 1: గాజువాక – ఎన్‌ఏడీ (NAD) – భోగాపురం మార్గంలో 10 బస్సులు.

రూట్ 2: సింధియా – రైల్వే స్టేషన్ – రుషికొండ – భోగాపురం మార్గంలో 10 బస్సులు.

డిపోలో వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక అవగాహన కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం సైట్‌లో ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది విశ్రాంతి గదులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. దీనికి అదనంగా ద్వారకా బస్ స్టేషన్, మద్దిలపాలెం, చోడవరం, కొత్తవలస, ఎలమంచిలి ప్రాంతాల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేస్తున్నారు. మరో 80 ఎలక్ట్రిక్ బస్సులు అక్టోబర్ నెలాఖరు నాటికి ఆర్టీసీ ఫ్లీట్‌లో చేరనున్నాయని అధికారులు తెలిపారు.

విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌లతో కలిసి ప్రధానమంత్రి పర్యటన, ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

కార్యక్రమం సజావుగా జరిగేందుకు శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించే జానపద కళా ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రారంభోత్సవం, బహిరంగ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తుండగా, సుమారు 3,000 వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. జనసమూహం, ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా చేసేందుకు భద్రతా ఏర్పాట్లను నాలుగు విభాగాలుగా విభజించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More