Khairatabad Bypoll : ఖైరతాబాద్ ఉపఎన్నికకు బ్రేక్.. ఇప్పట్లో బైపోల్ లేనట్టే!

Khairatabad Bypoll : ఖైరతాబాద్ అసెంబ్లీ బైపోల్‌కు బ్రేక్ పడినట్టుగా కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించిన పిటిషన్లు కోర్టులో విచారణలో ఉన్నాయి.

Published on: Oct 2, 2026, 08:06:21 IST
By , Khairatabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు బ్రేక్ పడింది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేంత వరకు ఆ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయబోమని హైకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం తరఫున నిలిచిన స్టాండింగ్ కౌన్సెల్ అవినాష్ దేశాయ్, ధర్మాసనానికి కమిషన్ స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.

ఖైరతాబాద్ బైపోల్
ఖైరతాబాద్ బైపోల్

గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన విజయారెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పి. విజయారెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ, ఆయన ఎన్నికను సవాలు చేస్తూ విజయారెడ్డి అప్పట్లోనే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు. రకరకాల ఆధారాలను చూపిస్తూ నాగేందర్ ఎన్నికను రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని కోరారు.

ఎన్నికల అనంతరం దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి మారారు. ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఫిరాయింపుల వ్యవహారంపై బీఆర్‌ఎస్ వేసిన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఇటీవలే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. ఆ నియోజకవర్గాన్ని ఖాళీగా ప్రకటిస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయారెడ్డి, ఖైరతాబాద్ ఉపఎన్నిక నిలిపివేయాలని కోరుతూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఆ స్థానాన్ని సాధారణ ఖాళీగా పరిగణించడానికి వీలులేదని స్పష్టం చేశారు.

తన వాదనలకు బలం చేకూర్చేలా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు కీలక తీర్పులను కోర్టు దృష్టికి తెచ్చారు. 'ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951'లోని సెక్షన్ 84 మరియు సెక్షన్ 98 (సి) నిబంధనలను ఆయన ఉటంకించారు. ఎలక్షన్ పిటిషన్ తేలేవరకు సదరు నియోజకవర్గానికి బై ఎలక్షన్ నిర్వహించే అధికారం ఈసీఐకి లేదని కోర్టుకు విన్నవించారు.

ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్, ఈసీఐ తరఫు న్యాయవాదుల వాదనలను విన్న ధర్మాసనం.. ఈ అంశంపై తమ పూర్తిస్థాయి వైఖరిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వాయిదా వేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More