నువ్వు ముఖ్యమంత్రివి…. ఆ భాషేంటి..? యుద్ధం స్టార్ట్ అవుతది - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

సొంత పార్టీ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడుకు నిధులు అడిగితే పండబెట్టి తొక్కుతా అంటున్నారని మండిపడ్డారు. 

Published on: Nov 18, 2026, 15:51:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగినందుకు తనపై సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని తప్పుబడుతూ రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ఫైర్

పండబెట్టి తొక్కుతా అనడం ఏంటి….?

ముఖ్యమంత్రి పదవిపై రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసొచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. "ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు. ఇంకో రెండేళ్లు ఉంటావు. కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వమని అడిగినందుకు రేవంత్ రెడ్డి నన్ను పండబెట్టి తొక్కుతా అంటున్నాడు. నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి….? నీవేం ముఖ్యమంత్రివి, నీదీ ఏం భాష? పండబెట్టి తొక్కుతా అనడం ఏంటి? మునుగోడు నిధులు ఆపితే మరో చరిత్ర సృష్టిస్తా," అంటూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

మంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని…. కేవలం నియోజకవర్గ అభివృద్ధే తనకు ముఖ్యమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. "పదవుల కోసం ఎవరి ఇంటి చుట్టూ నేను తిరగను. పదవుల కోసం నేను పాకులాడే వాడిని కాదు. మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు, మీరే ఉండండి. కానీ మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మా ఆకాంక్ష," అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ప్రజల సొమ్ము తినే మనిషిని కాదు రేవంత్ రెడ్డి. కాంట్రాక్ట్ టెండర్ ఎంతో చెప్పు దాని కంటే 20 శాతం తక్కువే టెండర్ వేస్తా.. ప్రజల సొమ్ము కాపాడుతా. రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే కుదరదు… యుద్ధం స్టార్ట్ అవుతది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపైనా….. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపైనా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "పేదలకు రెండు వేలు కాదు, ఐదు వేలు ఇచ్చినా తప్పు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందాలి. ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారిలో 10 శాతం మంది అనర్హులు ఉన్నారు. రైతు బంధు నిజమైన వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వాలి. కానీ హైదరాబాద్‌లో ఉండి ఉద్యోగం చేసుకునే వాళ్లకే ఇస్తున్నారు. దీనివల్ల కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడానికి ప్రతిపక్షంలోనే ఉండాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. “గత ప్రభుత్వం కాంట్రాక్టుల్లో లక్షల కోట్లు అప్పు చేసింది. వారు అవినీతి చేసి లక్షల కోట్లు కొల్లగొట్టిన సొమ్మును రికవరీ చేయాలి. గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీ కట్టడమే ఇప్పుడు సరిపోతుంది” అంటూ కామెంట్స్ చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More