...
...
Next Story

హైదరాబాద్‌లో దారుణం - సీనియర్ న్యాయవాదిని కారుతో ఢీకొట్టి హత్య…! వెలుగులోకి సీసీ పుటేజీ

హైదరాబాద్‌ మాసాబ్ ట్యాంక్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. తన ఇంటి బయట కారు ఎక్కుతున్న లాయర్ ఖాజా మొయినుద్దీన్‌(63)ను ఓ కారు బలంగా ఢీకొట్టగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి.

Published on: May 23, 2026, 18:47:17 IST
Advertisement

Hyderabad Advocate Khaja Moizuddin Murder Case : హైదరాబాద్ పరిధిలోని మాసాబ్ ట్యాంక్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన ఇంటి ముందు ఉన్న కారులో ఎక్కే క్రమంలో సీనియర్ న్యాయవాది ప్రమాదానికి గురయ్యాడు. ఆపై ఆస్పత్రికి తరలించినప్పటికీ గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారమే… న్యాయవాదిని కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది.

న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన దుండగులు
న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన దుండగులు

ప్రాథమిక వివరాల ప్రకారం.. సీనియర్ అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్(63) మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం వెలుపల పార్క్ చేసి ఉన్న తన టొయోటా ఇన్నోవా (Toyota Innova) కారులో బ్యాగును లోపల పెడుతున్నారు. ఆయన డ్రైవింగ్ సీట్ ఎక్కేందుకు సిద్ధమవుతున్న తరుణంలో…. రోడ్డుపై వస్తున్న ఒక గ్రీన్ కలర్ 'మహీంద్రా స్కార్పియో' కారు(నెంబర్ ప్లేట్ లేని) ఒక్కసారిగా అతనిపైకి దూసుకొచ్చింది. అత్యంత వేగంగా వచ్చి మొయిజుద్దీన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం దాటికి ఆయన కారు నుంచి దాదాపు 15-20 అడుగుల దూరంలోకి విసిరివేయబడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సదరు స్కార్పియో డ్రైవర్ వాహనం వెళ్లిపోయింది.

ఈ దారుణ ఘటనపై ఖాజా మొయిజుద్దీన్ కుమారుడు… న్యాయవాది అయిన మహ్మద్ ఫర్హాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి మరణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నాడు. వక్ఫ్ భూముల అక్రమ ఆక్రమణలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన తండ్రి సుదీర్ఘకాలంగా అనేక లీగల్ కేసులు నడుపుతున్నారని వివరించారు. ఈ లీగల్ వివాదాల వల్లే శత్రువులు ప్లాన్ చేసి ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

గతంలో కూడా తన తండ్రిపై పలుమార్లు దాడులు జరిగాయని, బెదిరింపులు వచ్చాయని ఫర్హాన్ వెల్లడించారు. ఈ హత్య వెనుక ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వారి పేర్లను ప్రధాన అనుమానితులుగా పేర్కొని…. వారిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు…

ఈ ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ (Hit-and-Run) కేసు నమోదైంది. కారు ప్రమాద తీవ్రత, కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంతో పాటు ప్రమాదానికి కారణమైన మహీంద్రా స్కార్పియో కారును స్వాధీనం చేసుకోవడానికి నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

ఈ సంఘటన హైదరాబాద్ లాయర్ల వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. సున్నితమైన, వివాదాస్పదమైన కేసులను డీల్ చేసే న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించాలని, ఖాజా మొయిజుద్దీన్ మృతికి కారణమైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను ఖండిస్తూ తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. సమగ్రమైన విచారణ జరిపించి… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe