ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆటో-లారీ ఢీ కొనడంతో ఒకే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు.
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి ఘాట్ రోడ్డు మార్గంలో ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొన్న ఘటనలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బుగ్గరామేశ్వరం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద ఈ ఘటన సంభవించింది.

వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామానికి చెందిన ఒకే గ్రామానికి చెందినవారు పనుల నిమిత్తం ఆటోలో కేరెల్లి గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో బుగ్గరామేశ్వరం సమీపంలోని అనంతగిరి ఘాట్ రోడ్డు మలుపు వద్దకు చేరుకోగానే, ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది.
లారీ వేగంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ధాటికి ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ నాగేశ్‌తో పాటు ముగ్గురు మహిళలు చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మృతులంతా పెండ్లిమడుగు గ్రామానికి చెందినవారు.
ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో నుజ్జునుజ్జయిన ఆటోలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా అనంతగిరి ఘాట్ రోడ్డుపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.
ఒకే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృత్యువాత పడటంతో పెండ్లిమడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘాట్ రోడ్డులోని మూలమలుపు వద్ద అతివేగం లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

E-Paper
