...
...
Next Story

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - హత్యకు కుట్ర జరిగిందంటూ డీజీపీకి లేఖ!

యాదాద్రి జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాన్వాయ్ కారును లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఇది తన హత్యకు జరిగిన కుట్ర అంటూ మల్లన్న డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Published on: Nov 14, 2026, 12:32:54 IST
Advertisement

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో కాన్వాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. మోత్కూరు మండలం అనాజిపురం వద్ద వేగంగా వచ్చిన ఒక లారీ మల్లన్న కాన్వాయ్‌లోని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న మరో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా…. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగింది కాదని…. బీసీ రాజ్యాధికార పాదయాత్ర చేస్తున్న తనను హత్య చేసేందుకు జరిగిన ముందస్తు కుట్ర అని అనుమానిస్తూ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు.

అసలేం జరిగింది…..?

యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం
యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం

మోత్కూరు నుంచి అనాజీపురం మీదుగా తిరుమలగిరి వైపు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార పాదయాత్ర' సాగుతోంది. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఆయన కాన్వాయ్‌లోని కారును బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన ధాటికి మల్లన్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మల్లన్న కారు నుజ్జునుజ్జయింది. అయితే, ఆ సమయంలో ఆయన కారులో లేకుండా పాదయాత్రలో నడుస్తుండటంతో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ఈ దుర్ఘటనలో ఎదురుగా వస్తున్న కారులో ప్రయాణిస్తున్న తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్‌, ఆయన భార్య చందన, రెండేళ్ల కుమారుడితో పాటు డ్రైవర్‌ సురేశ్ తీవ్రంగా గాయపడ్డారు. మల్లన్న కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మేడబోయిన చందన (23) మృతి చెందగా, ఆమె భర్త శ్రీనాథ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

నా హత్యకు కుట్ర జరిగి ఉండొచ్చు - డీజీపీకి లేఖ

ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తీన్మార్ మల్లన్న రాష్ట్ర డీజీపీకి సుదీర్ఘ లేఖ రాశారు. ప్రమాదం జరిగిన తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందని, ఇది తన వ్యక్తిగత భద్రతతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్న కార్యకర్తల ప్రాణాలకు ముప్పు కలిగిస్తోందని పేర్కొన్నారు. లారీని ఆయుధంగా వాడుకుని తనను హత్య చేయడానికి లేదా శారీరకంగా హాని తలపెట్టడానికి పథకం ప్రకారం దాడి చేసి ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని మల్లన్న స్పష్టం చేశారు.

వెనుకబడిన తరగతులకు న్యాయం, తగిన ప్రాతినిధ్యం సాధించాలనే ప్రజాస్వామ్యబద్ధమైన లక్ష్యంతో బీసీ రాజ్యాధికార పాదయాత్ర చేస్తున్నామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఇలాంటి ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గొంటున్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత తీవ్రమైన నేరమని అన్నారు. ప్రజాప్రతినిధిగా తనకు చట్టంపై, తెలంగాణ పోలీసుల నిష్పక్షపాత పనితీరుపై పూర్తి విశ్వాసం ఉందని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks