ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం మహీంద్రా, ఆస్ట్రేలియా వర్సిటీల మధ్య కీలక ఒప్పందం
మహీంద్రా యూనివర్సిటీ, ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ (ANU) మధ్య కుదిరిన '2+2' ఒప్పందం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ విద్యావకాశాలు లభించనున్నాయి. రెండేళ్లు హైదరాబాద్‌లో, మరో రెండేళ్లు ఆస్ట్రేలియాలో చదివి గ్లోబల్ డిగ్రీ పొందే వీలుంటుంది.
హైదరాబాద్: భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థుల విదేశీ విద్యా కలలకు రెక్కలు తొడిగేలా హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ (MU) ఒక కీలక అడుగు వేసింది. ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ANU) తో చేతులు కలిపి ఒక వినూత్న విద్యా ఒప్పందాన్ని (Articulation Agreement) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సరికొత్త మార్గం సుగమమైంది.

ఏమిటీ 2+2 ప్రోగ్రామ్?
ఈ ఒప్పందం ప్రకారం, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ నాలుగేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లను హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో పూర్తి చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రెండేళ్ల చదువును ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని ANU క్యాంపస్‌లో కొనసాగిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆస్ట్రేలియాలోనే అగ్రశ్రేణి వర్సిటీగా పేరున్న ANU నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందిన డిగ్రీ లభిస్తుంది.
డిమాండ్ ఉన్న ఏడు విభాగాల్లో అవకాశం:
ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు ఆసక్తి చూపే ఏడు కీలక ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ అవకాశం కల్పించారు. అవి:
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- మెకట్రానిక్స్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- నానో టెక్నాలజీ
"ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి ఉన్న అపారమైన పరిశోధనా నేపథ్యం, ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ఖ్యాతి.. మహీంద్రా యూనివర్సిటీ విద్యా దృక్పథానికి అద్దం పడతాయి. ఈ భాగస్వామ్యం మా విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ వేదికను అందించడమే కాకుండా, రెండు వర్సిటీల మధ్య విద్యా, పరిశోధనా బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది" అని మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాజులు మేడూరి పేర్కొన్నారు.
ఈ ఒప్పందంపై ANU స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అసోసియేట్ డైరెక్టర్ (ఇంటర్నేషనల్) ప్రొఫెసర్ శివ కరుటూరి స్పందిస్తూ.. "మెరుగైన ప్రతిభ కనబరిచే విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ 'సిస్టమ్స్ ఇంజనీరింగ్' విధానంలో చదువుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. మహీంద్రా వర్సిటీతో కలిసి విద్యా, పరిశోధనా రంగాల్లో సుదీర్ఘకాలం పనిచేయాలని ఆశిస్తున్నాం" అని వివరించారు.
ప్రవేశాలు, నాణ్యత:
విద్యార్థుల విద్యా ప్రమాణాలను కాపాడేందుకు గానూ, ప్రస్తుతానికి ఏడాదికి కేవలం 20 మంది విద్యార్థులను మాత్రమే ఈ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేయనున్నారు. కేవలం విద్యార్థుల మార్పిడికే పరిమితం కాకుండా.. అధ్యాపకుల మధ్య అనుభవాల మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు వంటి అంశాలకు కూడా ఈ ఒప్పందం పునాది వేస్తుందని మహీంద్రా యూనివర్సిటీ అసోసియేట్ డీన్ విశాలాక్షి తలకోకుల తెలిపారు.
నేపథ్యం:
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ స్థాపించిన మహీంద్రా యూనివర్సిటీ, పరిశోధన, వ్యవస్థాపకతకు పెద్దపీట వేస్తోంది. మరోవైపు, 1946లో స్థాపితమైన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ANU) అంతర్జాతీయంగా 32వ ర్యాంకులో (QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026) కొనసాగుతోంది. ఈ రెండు దిగ్గజ సంస్థల కలయిక తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గ్లోబల్ కెరీర్ దిశగా ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


