వీడియో : 'పరకాల' వివాదం వేళ ఇంట్రెస్టింగ్ సీన్ - సీఎం రేవంత్‌ ఇంటికి కొండా సురేఖ ! రాఖీ కట్టి...

రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాఖీ కట్టారు. పరకాల రాజకీయ వివాదం, క్రమశిక్షణ కమిటీ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Published on: Aug 28, 2026, 12:27:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇరువురు మంత్రులు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే…. ఇటీవల వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తర్వాత మంత్రి కొండా సురేఖ తొలిసారిగా ముఖ్యమంత్రి నివాసానికి రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయా.

సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ
సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ

కొండా సురేఖ ట్వీట్…

ఈ భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సహచర మంత్రి సీతక్కతో కలిసి సోదరులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలసి రాఖీ కట్టాను. మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు.

ఇటీవల ములుగు, పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన పలు అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేబినెట్ మంత్రి కొండా సురేఖ ఈ పర్యటనలకు దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక జిల్లా మంత్రి పాల్గొనకపోవడం అప్పట్లోనే అధికార కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శైలిని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరకాలలో తమ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే, పరకాల బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే శాసనసభ ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సభముఖంగా పిలుపునిచ్చారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డేననే స్పష్టమైన సంకేతాన్ని సీఎం ఇచ్చారు.

కుమార్తె వ్యాఖ్యలు – కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కొండా సురేఖ కుమార్తె సుస్మిత పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో అనుచరులతో సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచే తాను పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు.

నేరుగా ముఖ్యమంత్రిపైనే విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఈ పరిణామాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను ఎలా బాధ్యురాలినవుతానని మంత్రి సురేఖ కమిటీకి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తున్న పార్టీ నాయకత్వం, కేవలం నోటీసులతో వదలకుండా తదుపరి చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల నడుమ కొండా సురేఖ నేరుగా సీఎం నివాసానికి వచ్చి రాఖీ కట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More