మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు షాక్ తప్పదా? పీసీసీకి అందిన రిపోర్ట్

మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై నివేదిక టీపీసీసీ అధ్యక్షుడికి అందింది. వీరిద్దరిపై వేటు తప్పదా అని పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

Published on: Aug 25, 2026, 19:17:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, నాయకుల బహిరంగ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ సమగ్ర విచారణ పూర్తి చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ తయారు చేసిన తుది నివేదికను కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ కలిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు అందజేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేష్‌కుమార్ గౌడ్‌తో సమావేశమైన కమిటీ నాయకులు ఈ నివేదిక ప్రతిని అందజేశారు.

టీపీసీసీకి అందిన రిపోర్ట్
టీపీసీసీకి అందిన రిపోర్ట్

పార్టీ నిబంధనలను, హద్దులను దాటి మాట్లాడిన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సురేఖ వెంటనే ఖండించాల్సిందని కమిటీ అభిప్రాయపడింది. అంతేకాకుండా సురేఖ పార్టీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మూడోసారి అని, ఇకపై కూడా ఉపేక్షిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది.

సీనియర్ నాయకుడిగా, గతంలో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించిన చిన్నారెడ్డి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటంపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేబినెట్ హోదాలో ఉన్న ఆయనను కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.

నివేదికను అందజేసిన అనంతరం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు రవి మాట్లాడారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి సమర్పించిన రాతపూర్వక వివరణ లేఖలను, మీడియా కథనాలను, గతంలో జరిగిన సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నివేదికను సిద్ధం చేశామని తెలిపారు.

'కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. పార్టీ గౌరవ ప్రతిష్టలు కాపాడినప్పుడే రాబోయే రోజుల్లో సుస్థిరమైన పాలన అందించగలం. పార్టీకి నష్టం కలిగించేలా, అంతర్గత విషయాలను రచ్చకెక్కించేలా ఎవరూ మాట్లాడవద్దు. ఈ నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలతో పాటు రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా పంపుతున్నాం. అధిష్ఠానం ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు ఉంటాయి. పార్టీ శ్రేణులకు, నాయకులకు స్పష్టమైన సందేశం ఇవ్వడానికే ఈ చర్యలు అవసరమని భావిస్తున్నాం.' అని మల్లు రవి స్పష్టం చేశారు.

అయితే, ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వలేదని, ఇది కేవలం పార్టీ అంతర్గత వ్యవహారం కావడంతో పీసీసీ అధ్యక్షుడికే సమర్పించామని మల్లు రవి తెలిపారు. నివేదికలోని అంశాలపై అనవసరమైన ఊహాగానాలు ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ సమగ్ర నివేదిక ఆధారంగా మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More