తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ - పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం!

2027 తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ ముందస్తు అధ్యయన నివేదిక వెలువడింది. 39 శాతం మంది అభ్యర్థి వ్యక్తిత్వానికే ఓటేస్తామని చెప్పగా…. నిరుద్యోగం, ఉద్యోగ భర్తీలే ప్రధాన సమస్యలుగా తేలాయి.

Published on: Aug 18, 2026, 13:48:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana Graduate MLC Elections 2027 : పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈరోజు ‘తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ 2027’ పేరుతో ఒక ముందస్తు అధ్యయన నివేదికను ఇవాళ విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి/మార్చి నెలలో జరగనున్న తెలంగాణ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకుని, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఈ ఎన్నికల గురించి వారు ఏమనుకుంటున్నారు? గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటీ? తదితర అంశాలను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించారు.

తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ - పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం! (image source Pixel)
తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ - పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం! (image source Pixel)

పీపుల్స్ పల్స్ అధ్యయనం ప్రకారం, ఓటు వేసేటప్పుడు 39 శాతం మంది పట్టభద్రులు అభ్యర్థి గుణగణాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పగా... 36 శాతం మంది రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇక కులాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని 12 శాతం, డబ్బుకు 5 శాతం, మతానికి 2 శాతం మంది ప్రాధాన్యమివ్వగా, మరో 6 శాతం మంది ఇవన్నీ కలగలసి ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి విశ్వసనీయత, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజాదరణ, పట్టభద్రుల సమస్యలపై ఉన్న అవగాహన కీలక పాత్ర పోషించనున్నాయని ఈ నివేదికలో స్పష్టమైంది.

అగ్రస్థానంలో నిరుద్యోగ సమస్య….

పట్టభద్రుల ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగ సమస్యే అగ్రస్థానంలో నిలిచింది. నిరుద్యోగం 31 శాతం మందికి ప్రధాన సమస్యగా ఉండగా, జాబ్ నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆలస్యం 24 శాతం మందికి ప్రాధాన్య అంశంగా మారింది. ఈ రెండింటినీ కలిపితే ఏకంగా 55 శాతం మందికి ఉపాధి సంబంధిత అంశాలే ప్రధాన ఎజెండాగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇతర సమస్యల్లో పెరుగుతున్న ధరలు 13 శాతం, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల కొరత 12 శాతం, విద్యా రంగానికి చెందిన సమస్యలు 8 శాతం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు 7 శాతం, అవినీతి 5 శాతం చొప్పున నిలిచాయి.

ఓటర్లలో స్వతంత్ర ఆలోచనా ధోరణి కూడా పెరుగుతున్నట్టు పీపుల్స్ పల్స్ అధ్యయనంలో తేలింది. ఓటు వేసేటప్పుడు ఎవరి సలహాలూ తీసుకోమని 79 శాతం మంది చెప్పగా, కేవలం 21 శాతం మంది మాత్రమే ఇతరులను సంప్రదిస్తామని చెప్పారు. సలహాలు తీసుకునే ఆ 21 శాతం మందిలో కుటుంబ సభ్యులను సంప్రదించేవారు 34 శాతం, స్నేహితులను 31 శాతం, సహోద్యోగులను 15 శాతం మంది ఉన్నారు. రాజకీయ నాయకుల సలహాలు తీసుకుంటామని 9 శాతం మంది, కుల సంఘాల నాయకులను సంప్రదిస్తామని 6 శాతం మంది మాత్రమే తెలిపడం గమనార్హం.

మరోవైపు…. ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పనితీరుపై పట్టభద్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డి మహబుబ్ నగర్ నియోజవర్గం, నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల ప్రతినిధుల ఎలా ఉందని అడిగినప్పుడు బాగుందని కేవలం 31 శాతం మంది మాత్రమే చెప్పగా, 53 శాతం మంది పనితీరు సరిగ్గా లేదని అభిప్రాయపడ్డారు. తొమ్మిది శాతం మంది పనితీరు సాధారణంగా ఉందన్నారు, మరో ఏడు శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు.

అభ్యర్థులు నేరుగా వచ్చి కలవడం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడమే రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, అభ్యర్థి గురించి ఎక్కడి నుంచి సమాచారం సేకరించి, నిర్ణయం తీసుకుంటారని అడిగినప్పుడు అభ్యర్థి చేపట్టే ప్రచారాలు, భేటీలు అని 25 శాతం అని చెప్పగా... వాట్సాప్ 24 శాతం, ఇన్‌స్టాగ్రామ్ 18 శాతంతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఫేస్‌బుక్ ద్వారా 9 శాతం, స్నేహితులు, సహోద్యోగుల ద్వారా 8 శాతం, వార్తా ఛానెళ్లు, పత్రికల ద్వారా 7 శాతం, 'ఎక్స్' ద్వారా 4 శాతం, పార్టీ కార్యకర్తల ద్వారా కేవలం 2 శాతం మంది సమాచారం పొందుతున్నట్లు చెప్పారు.

ఇటీవల వచ్చిన "కాక్రోచ్ జనతా పార్టీ" ఉద్యమం యువత, పట్టభద్రుల ఆలోచనా సరళిపై చూపిన ప్రభావాన్ని కూడా పీపుల్స్ పల్స్ బృందం పరిశీలించింది. ఈ ఉద్యమం వల్ల తమ రాజకీయ ఆలోచనల్లో గణనీయమైన మార్పు వచ్చిందని 18 శాతం మంది, కొంతవరకు మార్పు వచ్చిందని 36 శాతం మంది తెలపడంతో, మొత్తంగా 54 శాతం మంది ఆలోచనలపై ఇది ప్రభావం చూపినట్లు తెలిసింది. అంతేకాకుండా, ఈ ఉద్యమం లేవనెత్తిన అంశాలు తమ ఓటింగ్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని 62 శాతం మంది భావిస్తున్నారు (ఇందులో 24 శాతం మందిపై తీవ్ర ప్రభావం, 38 శాతం మందిపై కొంత ప్రభావం ఉంటుంది). అయితే, దీనిని సదరు ఉద్యమానికి లేదా దాని రాజకీయ వేదికకు ప్రత్యక్ష మద్దతుగా పరిగణించకూడదని పీపుల్స్ పల్స్ స్పష్టం చేస్తున్నది.

రాజకీయ పార్టీలకు, పోటీ చేయబోయే అభ్యర్థులకు ఈ సర్వే కొన్ని కీలక సూచనలు ఇస్తోంది. సరైన అభ్యర్థి ఎంపిక, ఉపాధి, ఉద్యోగ భర్తీ, ప్రజాప్రతినిధుల పనితీరు, జవాబుదారీతనం, ఓటర్లతో నేరుగా మమేకం కావడం, డిజిటల్ ప్రచారం, యువజన ఉద్యమాలు, సమస్యల ఆధారిత వేదికలు రాబోయే పట్టభద్రుల ఎన్నికల పోరులో నిర్ణాయక శక్తిగా మారనున్నాయని పేర్కొంది.

ఈ సర్వేను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆగస్టు 10 నుండి ఆగస్టు 15, 2026 వరకు నిర్వహించింది. హైదరాబాద్-రంగారెడ్డి -మహబూబ్‌నగర్... నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5,000 మంది చొప్పున మొత్తం 10,000 మంది సమాధానాలను సేకరించారు. అధ్యయనం సమయంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో, పాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ఆధారంగా కంప్యూటర్ ఆధారిత టెలిఫోన్ ఇంటర్వ్యూల (CATI) ద్వారా ఈ అధ్యయనాన్ని చేపట్టింది.

ఈ సర్వే కేవలం మూడ్ అంచనా మాత్రమేనని, ఎన్నికల తుది ఫలితాల అంచనా కాదని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు, అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు ఇంకా పూర్తి కాకపోవడంతో ఓటర్ల ప్రాధాన్యతలు, నమోదుపై అవగాహన, ప్రాతినిధ్యంపై అంచనాలు, సమాచార వనరులు, యువత-పట్టభద్రుల సమస్యలపైనే సర్వే ప్రధానంగా దృష్టి సారించింది. ఓటర్ల నమోదు పూర్తయిన తర్వాత, నామినేషన్లు పూర్తయిన తర్వాత, ఆపై ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ట్రాకర్ పోల్ సర్వేలను నిర్వహించనుంది. ఆయా దశల్లో ఓటర్ల అభిప్రాయాలు , ఓటింగ్ మొగ్గు, అభ్యర్థులు, పార్టీలపై ఉన్న ప్రాధాన్యతలు, ప్రధాన సమస్యలు, ప్రచార ప్రభావంతో పాటు నియోజకవర్గాల వారీ ట్రెండ్‌లలో వచ్చే మార్పులను ఈ అధ్యయనాలు అంచనా వేస్తాయి.

మొత్తంమీద, 2027 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాన్ని అభ్యర్థి విశ్వసనీయత, ఉపాధి, ఉద్యోగాల భర్తీ ఆందోళనలు, ప్రస్తుత ప్రజాప్రతినిధుల పనితీరుపై ఉన్న అంచనాలు, యువత ఆకాంక్షలు, ప్రత్యక్ష సంప్రదింపులు, కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ ఉద్యమాలు ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ రీసర్చ్ ఆర్గనైజేషన్ నివేదికలో పేర్కొంది.

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణ పీపుల్స్ పల్స్ సర్వేవి. హిందుస్తాన్ టైమ్స్‌ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు).

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More