TG Fertilizer App : యూరియా యాప్‌లో మార్పులు - ఇక టెలిఫోన్, మీసేవా ద్వారా బుకింగ్..!
Telangana Govt Fertilizer App : తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఫెర్టిలైజర్ యాప్ ను మరింత సరళీకృతం చేయనున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా మరియు టెలిఫోన్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana Govt Fertilizer App : వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడించి…. ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రాష్ట్ర ఫెర్టిలైజర్ యాప్’ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాప్ విధానం ద్వారానే రైతులకు ఎరువులను పంపిణీ చేస్తున్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఈ డిజిటల్ వ్యవస్థ దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ సర్కారు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ఇతర రాష్ట్రాలను సైతం ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. ఈ ఫెర్టిలైజర్ యాప్ పనితీరును పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారని తెలిపారు.
యాప్ లో మరిన్ని మార్పులు…
రైతాంగం నుంచి వచ్చిన విలువైన సూచనలు, క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రాష్ట్ర ఫెర్టిలైజర్ యాప్‌లో ప్రభుత్వం మరిన్ని మార్పులు, చేర్పులు చేసింది. యాప్‌ను రైతులకు మరింత సులభంగా మార్చేందుకు కింది సదుపాయాలను కొత్తగా చేర్చారు.
- జిల్లా వారీగా డీలర్ల స్టాక్ నిర్ధారణ కోసం ప్రత్యేక షెడ్యూలింగ్ వ్యవస్థ.
- మండలాల వారీగా లభ్యతను సులభంగా చూపే మండల మ్యాపింగ్ సదుపాయం.
- స్మార్ట్‌ఫోన్ లేని రైతుల కోసం మీసేవా కేంద్రాల ద్వారా మరియు టెలిఫోన్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకునే సౌకర్యం.
- రైతుల సందేహాలను సకాలంలో నివృత్తి చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ విభాగం.
ఈ సరికొత్త మార్పుల వల్ల రైతులకు ఎరువుల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రైతులు ఇళ్ల వద్ద నుంచే ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో తమ మొబైల్ ఫోన్లలోనే చూసుకోవచ్చు. దీనివల్ల ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి తిరిగే తిప్పలు తప్పడమే కాకుండా, ఎరువుల డిపోల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది.
గతంలో ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో కొందరు మధ్యవర్తులు సరుకును పక్కదారి పట్టించి కృత్రిమ కొరత సృష్టించేవారు. కానీ…. ఈ డిజిటల్ యాప్ అందుబాటులోకి వచ్చాక ప్రతి లీటరు, ప్రతి బస్తా ఎరువుల కదలికలపై నిరంతర నిఘా ఉంటోంది. దీంతో ప్రతి దశలోనూ పారదర్శకత పెరిగి, పంపిణీ వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. రైతులకు న్యాయంగా…. సకాలంలో ఎరువులు అందించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
“ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి. నడ్డాకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం చేసిన గట్టి ప్రయత్నాల వల్ల ఇప్పటికే రాష్ట్రానికి 3.89 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విజయవంతంగా చేరింది. జూన్ నెలాఖరు నాటికి రావలసిన మిగిలిన కోటాను కూడా సకాలంలో రప్పించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు” అని మంత్రి తుమ్మల వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

