రాష్ట్రంలో ఎరువుల అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లాల వారీగా రోజూ మానిటరింగ్

రాష్ట్రంలో ఎరువుల అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వ్యవసాయేతర వినియోగం, బ్లాక్ మార్కెట్, అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. రోజూవారీ మానిటరింగ్ చేయనుంది.

Published on: May 20, 2026, 17:34:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఎరువుల అక్రమాలపై ప్రభుత్వం సీరియస్
ఎరువుల అక్రమాలపై ప్రభుత్వం సీరియస్

రైతులకు సరైన సమయంలో నాణ్యమైన ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి అచ్చెన్న ఘాటుగా హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, పరిశ్రమలకు మళ్లించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే డీలర్లు, మధ్యవర్తులు, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మంజీర్ జిలానీకి మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. 2026-27 సంవత్సరంలో మే 4వ తేదీ నుండి ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అమలు విభాగం చేపట్టిన కఠిన చర్యలను మంత్రి వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘించిన ఎరువుల డీలర్లకు 182 షోకాజ్ నోటీసులు జారీ చేశారు, 80 ఎరువుల లైసెన్సులను సస్పెండ్ చేశారు, 1 ఎరువుల లైసెన్సును రద్దు చేశారు. సెక్షన్ 6-A కింద 1 కేసు నమోదు చేశారు, రూ.707 లక్షల విలువైన 3372 మెట్రిక్ టన్నుల ఎరువులను నిర్బంధించారు. రూ.5 లక్షల విలువైన 2 మెట్రిక్ టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, రైతులకు అందకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్న హెచ్చరించారు. ఎరువులను పక్కదారి పట్టించినట్లు రుజువైతే సంబంధిత డీలర్ల లైసెన్సులు వెంటనే రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యవసాయ శాఖ అధికారులపైనా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఒకే జిల్లాలో సంబంధిత అధికారుల ప‌రిధిలో ఎరువుల అమ్మకాల్లో పునరావృతంగా అవకతవకలు, నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూస్తే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేసే అధికారాన్ని జిల్లా జాయింట్ డైరెక్టర్లకు (జేడీలు) అప్పగించినట్లు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. రైతులకు సరైన సమయంలో, సరిపడా పరిమాణంలో నాణ్యమైన ఎరువులు అందేలా జిల్లా వారీగా స్టాక్‌లపై రోజువారీ మానిటరింగ్ నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ నియంత్రణ కోసం విజిలెన్స్ విభాగం, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల నిఘాను మరింత పెంచుతున్నట్లు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More