యుద్ధ ప్రభావంతో ఎరువుల రేట్ల మోత.. ఖరీఫ్ వేళ అన్నదాతలకు తప్పని తిప్పలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంపై పడుతోంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రైతులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొన్నది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు దేశంలోని వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా సప్లై చైన్ దెబ్బతినడంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 50 కిలోల బస్తా ధర రకాన్ని బట్టి రూ. 2,000 నుండి రూ. 2,350కుపైగా పలుకుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎంత పెరిగినా కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తుండటంతో యూరియా, డీఏపీ ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. మే నెల లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా డీఏపీ బస్తా అసలు ధర రూ. 4,488 కాగా, కేంద్రం సబ్సిడీతో రైతులకు కేవలం రూ. 1,350 కే అందిస్తోంది. అలాగే రూ. 2,800 పైగా ఉన్న యూరియా బస్తాను కేవలం రూ. 266.50 కే ప్రభుత్వం ఇస్తోంది.
అసలు సమస్య ఎక్కడంటే కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల, రైతులంతా సహజంగానే తక్కువ ధరకు వచ్చే యూరియా, డీఏపీ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల ఖరీఫ్ సీజన్ ఊపందుకునే సరికి వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. మార్కెట్లో తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైతాంగం ఎక్కువగా నమ్ముకునే గంధకం ఉండే రకం ఎరువు బస్తా భారీగా పెరిగింది. ధరపై యుద్ధం కోలుకోలేని దెబ్బకొట్టింది. గత ఏడాది పాత ధరలతో పోలిస్తే ఇది ఏకంగా 133 శాతం వరకు పెరిగింది. కొన్ని కంపెనీలు రూ. 2,100 నుండి రూ. 2,200 మధ్య అమ్ముతున్నాయి. మరికొన్ని కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి.
ఎరువుల తయారీకి అవసరమైన ఫాస్ఫారిక్ యాసిడ్, అమ్మోనియా, ఎంఓపీ ధరలు అంతర్జాతీయంగా సగటున 20 శాతానికి పైగా పెరిగాయి. వీటికి తోడు సల్ఫర్ ధర ఏకంగా 133 శాతం పెరిగింది. చైనా దేశం ఎగుమతులపై నిషేధం విధించడం, ఇరాన్, ఖతార్ దేశాల నుండి అమ్మోనియా సరఫరా పూర్తిగా నిలిచిపోవడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.
మార్కెట్లో రోజురోజుకూ రేట్లు మారుతున్నా, ఏ ఎరువు ధర ఎంత పెరిగిందనే కనీస సమాచారం వ్యవసాయ శాఖ నుండి రైతులకు అందడం లేదు. గ్రామీణ స్థాయిలోని అధికారులకు సైతం ఈ ధరల పెంపుపై స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు పాత స్టాక్‌ను కూడా కొత్త ధరలకు (ఎమ్మార్పీ కంటే ఎక్కువకు) విక్రయించే ప్రమాదం ఉంది.
తక్షణమే ప్రభుత్వం స్పందించి పెరిగిన కాంప్లెక్స్ ఎరువులపై కూడా అదనపు రాయితీలు ప్రకటించాలని రైతన్నలు కోరుతున్నారు. ధరలు తగ్గించకపోతే, రాబోయే ఖరీఫ్ సీజన్‌లో అన్నదాతలకు కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


