ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక కార్డు ద్వారానే యూరియా పంపిణీ
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కార్డుల ద్వారా రైతులకు యూరియా సరఫరా చేసేందుకు సిద్ధమైంది.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సాగు సంక్షోభం తలెత్తకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగింది.

ఖరీఫ్-2026 సాగు సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సచివాలయంలో ఉన్నతాధికారులు, జిల్లాల జేడీఏలు, వ్యవసాయ అధికారులతో (DAOs) సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతులకు సకాలంలో సేవలు అందించడమే కాకుండా, నకిలీలు, బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేసేలా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
యూరియా పంపిణీకి ప్రత్యేక కార్డులు
యూరియా కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఇకపై ప్రత్యేక కార్డుల ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ చేయనున్నారు. దీనివల్ల రైతులకు వారి భూమి, అవసరానికి తగినట్లుగా సకాలంలో ఎరువులు అందుతాయి.
బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం
ఎరువులు, విత్తనాల అక్రమ రవాణా లేదా కృత్రిమ కొరత సృష్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్‌షిప్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
నిరంతర పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీ ప్రక్రియను ఉన్నతాధికారులు నిరంతరం డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షిస్తారు. ఏ జిల్లాలోనూ స్టాక్ కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎల్‌నినోపై రైతుల్లో అవగాహన
వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ప్రత్యామ్నాయ పంటలు (తక్కువ నీటితో పండే పంటలు) ఎలా వేయాలనే దానిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు.
గ్రామాల్లో ప్రత్యేక ప్రచారం
వ్యవసాయ శాఖ వ్యూహాలను, ప్రభుత్వ సాయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రత్యేక సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
'రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఎల్‌నినో ముప్పు ఉన్నప్పటికీ, రైతాంగానికి సాగునీరు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు, మార్కెటింగ్ పరంగా ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.' అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. స్వీట్ ఆరెంజ్ తోటల్లో నీటి ఒత్తిడి పరిస్థితులపై ఇప్పటికే రెండు నెలల క్రితమే అనంతపురం జిల్లాలో అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌లు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
జిల్లాలో మొత్తం 37 వేల హెక్టార్ల స్వీట్ ఆరెంజ్ తోటలు ఉండగా, అందులో 2,260 హెక్టార్లలో సాగునీటి సమస్యను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతులు లైవ్ మల్చింగ్, వీడ్ మ్యాట్ వినియోగం, ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేయడం, అవసరమైన చోట్ల నీటిని తరలించి జీవనాధార నీటి సరఫరా చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా మూడు గ్రామాల్లో 875 హెక్టార్లలో తీవ్రమైన నీటి కొరత నెలకొన్నదని, రైతులు భారీ వ్యయంతో నీటిని తరలించి తోటలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
అయితే రవాణా వ్యయం అధికంగా ఉండటం, ఇతర ప్రాంతాల్లో కూడా తోటలు ఉండటంతో ఇద్దరు రైతులు కలిపి సుమారు 4.5 హెక్టార్ల తోటలను వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లో నీటి కొరత కారణంగా ఆయా గ్రామాల చెరువులు నింపబడలేదని, చెరువులు నింపగలిగితే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉందన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


