TG Muncipal Election Results : రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ - ఫలితాలపై ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 13(రేపు)వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 బీఎస్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుంది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 13, 2026) ఉదయం 8 గంటలకు నిర్దేశిత కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

కౌంటింగ్ కోసం అవసరమైన సూపర్ వైజర్లు, అసిస్టెంట్లను నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు…. కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 (నిషేధాజ్ఞలు) అమలు చేస్తారు.
కౌంటింగ్ హాల్ లోపలికి కేవలం సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరందరూ తప్పనిసరిగా జారీ చేసిన పాసులు కలిగి ఉండాలి. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు. స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ ప్రాసెస్ ఇలా…
- మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ పత్రాలను తీసుకుంటారు.
- ఒక వార్డులోని అన్ని బ్యాలెట్ పెట్టెలను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్ వద్దకు తీసుకువస్తారు.
- పోలింగ్ స్టేషన్ బ్యాలెట్ పత్రాలను 25 సెట్లలో బండిల్ చేస్తారు. మిగిలిపోయిన బ్యాలెట్లు 25 కంటే తక్కువగా ఉంటే…. వాటిని ప్రత్యేక బండిల్‌గా తయారు చేసి కౌంట్‌తో లేబుల్ చేస్తారు.
- పోలింగ్ స్టేషన్ల వివరాలు నమోదు చేసిన తర్వాత…. వార్డులోని అన్ని బ్యాలెట్ కట్టలను ఒక పెద్ద డ్రమ్ములో వేసి బాగా కలుపుతారు. దీనివల్ల ఏ పోలింగ్ స్టేషన్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియకుండా గోప్యత పాటించవచ్చు.
- అసంపూర్తిగా ఉన్న కట్టలను సాధ్యమైనంత వరకు కలిపి పూర్తి కట్టలుగా మారుస్తారు. మిగిలిన చిల్లర ఓట్లను విడిగా ఉంచి లెక్క రాస్తారు. ఈ ప్రక్రియను ప్రతి వార్డుకూ ఇదే రీతిలో అనుసరిస్తారు.
- బ్యాలెట్లను బాగా కలిపిన తర్వాత లెక్కింపు మొదలవుతుంది. ప్రతి రౌండ్‌లో డ్రమ్ము నుంచి 1000 ఓట్లను (40 కట్టలు ) తీసి కౌంటింగ్ టేబుళ్లకు పంపిస్తారు. అక్కడ అభ్యర్థులు, నోటా, సందేహాస్పద ఓట్ల కోసం వేర్వేరు గదులున్న చెక్క ట్రేలను ఉపయోగిస్తారు.
- ప్రతి ఓటును ఏజెంట్లకు చూపిస్తూ దాని చెల్లుబాటును నిర్ధారిస్తారు. సంబంధిత అభ్యర్థి ట్రేలో వేస్తారు.
- అభ్యర్థుల వారీగా వచ్చిన చెల్లుబాటయ్యే ఓట్లను 100 చొప్పున కట్టలుగా కడతారు. అలాగే నోటా, సందేహాస్పద ఓట్లను కూడా 100 చొప్పున బండిల్ చేస్తారు. వందకు తక్కువగా ఉన్న ఓట్లను విడిగా ఉంచి ఆ సంఖ్యను స్లిప్ పై రాస్తారు. సందేహాస్పద ఓట్లపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకుంటారు.
- రౌండ్ వారీగా అభ్యర్థుల ఓట్లు మరియు తిరస్కరించబడిన ఓట్లను తుది ఫలిత పత్రంలో నమోదు చేస్తారు. ప్రతి రౌండ్ తర్వాత ఏజెంట్ల సంతకాలను తీసుకుంటారు. ఫలితాలు ప్రకటించబడతాయి.
- లెక్కింపు, ధృవీకరణ పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటించబడతాయి. గెలిచినవారికి సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి. రిటర్నింగ్ అధికారి వీటిని అందజేస్తారు.
ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు తప్పా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.
తుది పోలింగ్ శాతం 73.01గా ఎన్నికల సంఘం అంచనా వేసింది. మెుదట 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. 2,996 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం 62.55 శాతంగా ఉంది. 3.26 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
7 కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 శాతం అత్యధికంగా నమోదవ్వగా.. అత్యల్పంగా నందికొండలో 59.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో 77.36 శాతం, అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12 శాతం ఓట్లు పడ్డాయి. 72.63 శాతం పురుష ఓటర్లు, 73.39 శాతం మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొటీ నెలకొంది. ప్రతి వార్డును కూడా సవాల్ గా తీసుకోగా…. మెజార్టీ స్థానాలు గెలిచిన పార్టీలు ఆయా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

