తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెుత్తం పోలింగ్ శాతం ఎంతంటే?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు.

Published on: Feb 11, 2026, 22:16:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు తప్పా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఓటింగ్ ప్రయత్నాలు, అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ, అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పలు ప్రాంతాల్లో ఆరోపణలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణలు జరిగినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు (@Collector_HNK)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు (@Collector_HNK)

తుది పోలింగ్ శాతం 73.01గా ఎన్నికల సంఘం అంచనా వేసింది. మెుదట 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. 2,996 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం 62.55 శాతంగా ఉంది. 3.26 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది. చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో 91.91 శాతం అత్యధికంగా నమోదవ్వగా.. అత్యల్పంగా నందికొండలో 59.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో 77.36 శాతం, అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12 శాతం ఓట్లు పడ్డాయి. 72.63 శాతం పురుష ఓటర్లు, 73.39 శాతం మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

పోలింగ్ వేగం పుంజుకుంటున్న కొద్దీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. కరీంనగర్ పట్టణంలోని 58వ డివిజన్‌లో ఒక ఓటరు తన ఓటు ఇప్పటికే వేసినట్టుగా ఫిర్యాదు చేయడంతో పోలింగ్ స్టేషన్ వద్ద రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నాగర్ కర్నూల్‌లోని 15వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బోగస్ ఓటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుండి బయటకు పంపిన తర్వాత బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ పోలింగ్ కేంద్రంలో పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరోవైపు సంగారెడ్డి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రం దగ్గర చోటుచేసుకున్న ఉద్రిక్తతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతినేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసీ అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ చర్యలపై జగ్గారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ దొంగ ఓట్లపైనే తాను ప్రశ్నించానని వివరణ ఇచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More