Bangladesh Elections : రేపే బంగ్లాదేశ్​లో ఎన్నికలు- ఫలితాలు, మెజారిటీ మార్కు వివరాలు..

షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తొలి సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 12) దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. బంగ్లాదేశ్​ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 11, 2026 10:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అలజడులు, హింసాత్మక ఘటనల మధ్య బంగ్లాదేశ్​ ఎన్నికలకు​ సన్నద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు గురువారం, ఫిబ్రవరి 12న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మాజీ ప్రధాని షేక్​ హసీనా లేని బంగ్లాదేశ్​లో జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రచారాల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది.

బంగ్లాదేశ్​ నేషనలిస్ట్​ పార్టీ ఛైర్మన్​ తారీఖ్​ రహ్మాన్​.. (REUTERS)
బంగ్లాదేశ్​ నేషనలిస్ట్​ పార్టీ ఛైర్మన్​ తారీఖ్​ రహ్మాన్​.. (REUTERS)

బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఈ 2026 ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ధాటికి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత, మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

బంగ్లాదేశ్​ ఎన్నికల షెడ్యూల్, కీలక సమయాలు..

ప్రచారం ముగింపు: ఫిబ్రవరి 10, రాత్రి 7:30 గంటలకు.

పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 12, 2026 (ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 వరకు).

ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి 13 ఉదయం అధికారికంగా వెల్లడిస్తారు.

ప్రత్యేకత: ఇదే రోజున 'జూలై నేషనల్ చార్టర్' (రాజ్యాంగ సవరణలు) పై జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుగుతుంది.

బంగ్లాదేశ్​ ఎన్నికలు 2026- బరిలో ఉన్న ప్రధాన పార్టీలు..

ఈసారి ప్రధాన పోటీ తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్​పీ), జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీలతో కూడిన 'లైక్-మైండెడ్ 11 పార్టీస్' కూటమి మధ్యే ఉండనుంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు.

బంగ్లాదేశ్​ ఎన్నికలు- భారత్‌తో సంబంధాలపై ప్రభావం:

హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై (ముఖ్యంగా హిందువులపై) జరిగిన దాడుల నేపథ్యంలో భారత్-బంగ్లా సంబంధాలు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఇప్పటికే టూరిస్ట్ వీసాలపై ఆంక్షలు విధించింది. అలాగే క్రీడా పరంగా కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలలో జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం దీనికి నిదర్శనం. ఈ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు అటు బంగ్లాదేశ్​తో పాటు ఇటు దాని పొరుగు దేశమైన భారత్​కి కూడా కీలకంగా మారాయి.

బంగ్లాదేశ్​ ఎన్నికలు- మెజారిటీ మార్కు ఎంత?

బంగ్లాదేశ్ పార్లమెంటు (జాతీయ సంసద్)లో మొత్తం 350 సీట్లు ఉంటాయి.

నేరుగా ఎన్నికయ్యే సీట్లు: 300

మహిళా రిజర్వ్డ్ సీట్లు: 50

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు: 151 (సాధారణ మెజారిటీ).

రాజ్యాంగ సవరణలు చేయాలంటే కనీసం 200 సీట్లు (2/3 వంతు మెజారిటీ) సాధించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందో లేదోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.