ఇదీ ఇండియా పవర్.. క్రికెట్లో భారత్ హవా..రెండేళ్లలో ఏకంగా 5 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ.. టోర్నీ ఏదైనా టైటిల్ మ‌న‌దే!

ప్రస్తుతం ప్రపంచ  క్రికెట్లో ఇండియా డామినెన్స్ మామూలుగా లేదు. గత రెండేళ్లలో అయితే ఎక్కడ చూసినా మనదే ఆధిపత్యం. ఏ ఐసీసీ టోర్నీ అయినా మనదే విజయం. ఈ రెండేళ్లలో ఇండియా ఏకంగా అయిదు ప్రపంచకప్ లు గెలవడం విశేషం. 

Published on: Feb 08, 2026 4:12 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియాలో క్రికెట్ అంటే ఓ మతం. క్రికెటర్లు దేవుళ్ల కంటే తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు. అంతలా మన దేశ ప్రజలకు క్రికెట్ అంటే పిచ్చి. అలాంటి క్రికెట్ దేశం ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో అదరగొడుతోంది. రెండేళ్లలో ఏకంగా అయిదు ప్రపంచకప్ లు ఖాతాలో వేసుకుంది. ఓ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

అండర్-19 ప్రపంచకప్ గెలిచిన ఇండియన్ టీమ్ (AP)
అండర్-19 ప్రపంచకప్ గెలిచిన ఇండియన్ టీమ్ (AP)

ఇండియా డామినెన్స్

ఇటీవల ఐసీసీ అబ్బాయిల అండర్-19 ప్రపంచకప్ లో ఇండియా విజేతగా నిలిచింది. మన కుర్రాళ్లు అదరగొట్టారు. ఫైనల్లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడారు. ఇప్పుడు ఇండియాలో టీ20 పురుషుల ప్రపంచకప్ జరుగుతోంది. దీంతో దేశాన్ని మరోసారి క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో క్రికెట్లో ఇండియా డామినెన్స్ చూస్తే ఔరా అనకుండా ఉండలేం.

అయిదు ప్రపంచకప్ లు

ఐసీసీ ప్రపంచకప్ లో 2024 నుంచి ఇండియా ఆటతీరు మామూలుగా లేదు. ఏ ఐసీసీ టోర్నీ అయినా మన క్రికెట్ టీమ్స్ దే ఆధిపత్యం. 2024లో భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా పొట్టి కప్ ను సొంతం చేసుకుంది. 2007 తర్వాత ఇండియా గెలిచిన రెండో టీ20 ప్రపంచకప్ ఇదే. ఈ ప్రపంచకప్ తో కలిపి అప్పటి నుంచి ఇండియన్ టీమ్స్ అయిదు సార్లు వరల్డ్ కప్ ట్రోఫీలు సొంతం చేసుకున్నాయి.

2024లో పురుషుల టీ20 ప్రపంచకప్, 2025లో అమ్మాయిల అండర్-19 ప్రపంచకప్, 2025లో మహిళల వన్డే ప్రపంచకప్, 2025లో అంధుల మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్, 2026లో అండర్-19 అబ్బాయిల ప్రపంచకప్ భారత్ ఖాతాలో చేరాయి.

అమ్మాయిలు అదుర్స్

మహిళల క్రికెట్లో ఒకప్పుడు ఇండియా టీమ్ ను తక్కువగా చూసేవాళ్లు. పెద్దగా పోటీ ఇస్తుందని అనుకునేవాళ్లు కాదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా డామినెన్స్ సాగేది. కానీ ఇప్పుడు మన అమ్మాయిలూ అదరగొడుతున్నారు. 2025లో అండర్-19 అమ్మాయిల ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది.

అదే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్ ను దక్కించుకున్న ఇండియా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఇక అంధుల మహిళల టీమ్ కూడా తామేం తక్కువ కాదన్నట్లు 2025 టీ20 ప్రపంచకప్ ను పట్టేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ కూడా

ప్రపంచకప్ లే కాదు మరో ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇండియా అదరగొట్టింది. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్ విజేతగా నిలిచింది. ఇలా మొత్తానికి ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఇండియా ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ డామినెన్స్ ఇలాగే సాగి ఇప్పుడు పురుషుల టీ20 ప్రపంచకప్ ను కూడా ఇండియా గెలుచుకోవాలన్నది అభిమానుల ఆకాంక్ష.