ఇండియాలో ఆడరా? అయితే ప్రపంచకప్ ఆడకండి- బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ- వరల్డ్ కప్ నుంచి ఔట్- దాని ప్లేస్‌లో స్కాట్లాండ్‌

ఇండియాలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడలేమన్న బంగ్లాదేశ్ కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. మొత్తం వరల్డ్ కప్ నుంచే ఆ జట్టును తొలగించింది. బంగ్లా ప్లేస్ లో స్కాట్లాండ్ కు అవకాశం కల్పించింది. 

Published on: Jan 24, 2026 6:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అర్థం లేని వాదనతో మొండి పట్టు పట్టిన బంగ్లాదేశ్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ టీమ్ ను టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తొలగిస్తూ ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతుందని ఐసీసీ తేల్చేసింది.

బంగ్లాదేశ్ టీమ్ (AFP )
బంగ్లాదేశ్ టీమ్ (AFP )

బంగ్లాదేశ్ ఔట్

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం (జనవరి 24) తొలగించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ కు వెళ్లడానికి బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడమే దీనికి కారణం. బుధవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కు తుది నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ 24 గంటల సమయం ఇచ్చింది. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ భారత్ కు ప్రయాణించడం సాధ్యం కాదన్నారు.

స్కాట్లాండ్ టీమ్

గురువారం బంగ్లాదేశ్ చివరి ప్రయత్నం చేసినా అది విఫలమైంది. దీంతో టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ను తప్పించి, ఆ స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చింది ఐసీసీ. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ నుంచి ఒక క్రికెట్ జట్టును తొలగించడం ఇదే తొలిసారి.

"భారత్ కు ప్రయాణించడానికి నిరాకరించిన తర్వాత ఆ టీమ్ ను టోర్నమెంట్ నుంచి తొలగించినట్లు బీసీబీకి ఐసీసీ లెటర్ పంపింది. స్కాట్లాండ్ ను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసినట్లు వారికి కూడా సమాచారం అందించారు. లాంఛనాలు పూర్తయ్యాయి" అని ఐసీసీ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు ధృవీకరించాయి.

అసలు ఏమైందంటే?

బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలను ఇండియా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ పై ఐపీఎల్ ఆడకుండా వేటు వేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం బంగ్లాదేశ్ అనవసరమైన రాద్ధాంతం చేసింది. సెక్యూరిటీ కారణాల వల్ల టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లమని, తమ మ్యాచ్ లను అక్కడి నుంచి తరలించాలని ఐసీసీని కోరింది. కానీ అందుకు ఐసీసీ ఒప్పుకోక చివరకు బంగ్లాపైనే వేటు వేసింది.

గ్రూప్ సి

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ గ్రూప్ సిలో ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ, వెస్టిండీస్ తో కలిసి బంగ్లాదేశ్ ఉంది. ఆ టీమ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీతో మ్యాచ్ లు ఆడాల్సింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ స్థానంలో ఆ గ్రూప్ లో స్కాట్లాండ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7న స్టార్ట్ కానుంది. దీనికి ఇండియా, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్నాయి.