బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలదీ ఫెవికాల్ బంధం - సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలదీ ఫెవికాల్ బంధం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ల శరీరాలు వేరైనా తలకాయ ఒక్కటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో తలపెట్టిన సభలో మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
వరంగల్ – కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళికను ప్రకటించారు. ఈ రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లను పూర్తి చేస్తామన్నారు. ఆ రెండింటినీ కలుపే విధంగా రోడ్లను విస్తరించడమే కాకుండా రెండింటి మధ్య అతి పెద్ద డంప్ యార్డ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డంప్ యార్డ్ వద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండిలో రూ. 45.15 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)కి… అలాగే రూ. 5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
- అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు విమానాశ్రయం పూర్తి కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసి జంట నగరాలుగా వాటిని దేశానికే ఆదర్శంగా నిలబడే మున్సిపల్ కార్పొరేషన్లుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
- “2027 లో రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాద్ బాసర పుణ్యక్షేత్రం నుంచి ఖమ్మం, భద్రాచలం వరకు ఉన్న అన్ని దేవాలయాలను పూర్తిస్థాయి ప్రణాళికలతో అభివృద్ధి చేస్తాం. అందుకు అవసరమైతే నాలుగైదు వేల కోట్లను ఖర్చు చేసి వాటిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.
- పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా మధ్యలో అటవీ ప్రాంతాల్లో ఎకోటూరిజంను కూడా అభివృద్ధి చేస్తాం.
- రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, యువకులు, ఆడబిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం.
- వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలన్న సంకల్పంతో రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ, గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, రైతు బీమా, రైతుభరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ రంగానికి దేశంలోనే అత్యధికంగా 1.15 లక్షల కోట్లను ఖర్చు చేశాం.
- గడిచిన రెండేండ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. బీసీ, ఎస్సీ హాస్టళ్లు శిథిలావస్థలో ఉంటే పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నాం. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు 40 శాతం మేరకు మెస్ చార్జీలను, 200 శాతం మేరకు కాస్మెటిక్ చార్జీలను పెంచాం.
- ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలన్న లక్ష్యంతో ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యంతో మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే 27 వేల కోట్ల రూపాయలు అందించాం. మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను అప్పగించడమే కాకుండా, పెట్రోల్ బంకులు, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను కేటాయించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.
- ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేండ్లలో ఏం చేశామో శాసనసభ వేదికగా వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చేసుకునే సత్తా తెలంగాణకు ఉంది” అని అన్నారు.
BRS, బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్
మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ పెట్టుబడుదారులు ఎంత అడ్డంపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను సీఎం చేస్తే ఆస్తులు సంపాదించుకున్నారని దుయ్యబట్టారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని… కాంగ్రెస్ 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిందన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని చెప్పుకొచ్చారు.
“బీజేపీ నాయకులు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, మెట్రో రైలు మంజూరు చేయలేదు. మూసీకి నిధులు ఇవ్వలేదు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. ఇవేమీ ఇవ్వకుండా భాజపా జాతీయ అధ్యక్షుడిని ఎందుకు తీసుకొచ్చినట్లు? దేశంలోని భాజపా అగ్రనేతలందరినీ ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చినా ఒక్క మున్సిపాలిటీ గెలవకుండా కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటారు” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
"బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలదీ ఫెవికాల్ బంధం. వాళ్ల శరీరాలు వేరైనా తలకాయ ఒక్కటే. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అవయవదానం చేసింది. ఓట్లు, సీట్లు దానం చేసి 8 చోట్ల బీజేపీ ఎంపీలను గెలిపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు. దీనిపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

