గోదావరి పుష్కరాలు : 6 జిల్లాల్లో 373 ఘాట్లు.. రాజమండ్రిలో మోడల్ ఘాట్

గోదావరి పుష్కరాలపై ఏపీ సర్కార్ పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు కూడా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని సూచించారు. ఘాట్ల నిర్మాణం, భక్తులకు ఏర్పాట్లు చేసే విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Published on: Jan 24, 2026, 09:27:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున...పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు.

గోదావరి పుష్కరాలు
గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంచనాల నేపథ్యంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్రవారం గోదావరి పుష్కర పనులపై తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… పుష్కర ఏర్పాట్ల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గోదావరి ప్రవహించే 212 కిలోమీటర్ల పొడవునా పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. నిధుల కోసం ఇప్పటి నుంచే కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు.

ఘాట్ల సామర్ధ్యం పెంపు….

భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా వసతి సమస్యను తీర్చేలా టెంట్ సిటీలను...హోం స్టేలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. పుష్కర ఘాట్లల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఘాట్లలో రద్దీని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించేలా చూడాలన్నారు.

ప్రస్తుతం ఉన్న ఘాట్ల సామర్ధ్యాన్ని కూడా పెంచుకోవాల్సి ఉందన్నారు. స్నాన ఘాట్లలో రాకపోకలకు సంబంధించి రూట్ మేనేజ్‌మెంట్ రూపొందించాలని సూచించారు. వాహనాలు ఘాట్ల వరకు రాకుండా పార్కింగ్ ప్రాంతాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు, వాహన రద్దీ, టెంట్ సిటీలో అగ్ని ప్రమాదాలు లాంటి ఘటనలు తలెత్తకుండా పక్కాగా భద్రతా చర్యలు చేపట్టాలని ఇందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అన్నారు.

ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్‌ని, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలన్నారు. భద్రతా చర్యలు, సేవల విషయంలో ఎక్కడా మానవ ప్రయత్నంలో లోటు పాట్లు ఉండకూడదని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి భక్తులు వచ్చేందుకు వీలుగా రహదారులన్నీ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు

ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లు...మొత్తం కలిపి 373 ఘాట్లు 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా ప్రణాళికలకు రూపకల్పన చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం జిల్లాలో 14, ఏలూరు జిల్లా 34, తూర్పుగోదావరిలో 102, పశ్చిమ గోదావరి 40, కాకినాడ జిల్లా 6, బీఆర్ అంబేద్కర్ కోనసీమ 175 ఘాట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

రాజమహేంద్రవరంలో ముందుగా మోడల్ ఘాట్ నిర్మించి...ఆ డిజైన్ల ఆధారంగా మిగిలిన ఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ల సామర్ధ్యాన్ని కూడా పెంచాలని నిర్దేశించారు. పుష్కరాలకు సన్నద్ధతగా కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించాలని చెప్పారు. సమీక్షలో ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం అఖండ గోదావరి పేరుతో గోదావరి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు...పర్యాటక, చారిత్రాత్మకమైన ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించాలన్నారు.

పోలవరం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఘాట్లకు సెల్ సిగ్నల్స్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఆదరించి ఆతిథ్యం ఇచ్చేలా స్థానిక ప్రజల నుంచి సహకారం తీసుకోవాలని ప్రజా భాగస్వామ్యంతోనే పుష్కరాలు విజయవంతం అవుతాయని సీఎం అన్నారు.

ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వినియోగించినట్టే ఏఐ బేస్డ్ టెక్నాలజీని గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. భాషిణి యాప్ ద్వారా అన్ని భాషల భక్తులకు సేవలు అందించగలగాలని చెప్పారు. పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పుష్కరాలకు వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని... కేంద్రంతో మాట్లాడి రైళ్లు, విమాన సర్వీసులు అదనంగా నడిపేలా చూడాలన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More