హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తే చూడాలనేది నా డ్రీమ్ : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించాలని తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
2036లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాలని భారతదేశం పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ క్రీడల నిర్వహణకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలన్న బలమైన ఆకాంక్షను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఆ క్రీడల నిర్వహణకు అనుగుణంగా తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా సర్వసన్నద్ధం చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ క్రీడా వైభవం నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గచ్చీబౌలి స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శుభారంభం పలికారు. మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) జితేందర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, అధికారులు, విద్యార్థుల సమక్షంలో వాటికి శ్రీకారం చుట్టారు.
క్రీడలను ప్రోత్సహించాలన్న బలమైన ఆకాంక్షతో YIPESUని స్థాపించడం పట్ల ఈ సందర్భంగా పీటీ ఉష ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వచ్చే నవంబర్‌లో ఖేలో ఇండియా పోటీలను నిర్వహించడమే కాకుండా 2036 ఒలంపిక్స్ నిర్వహించాలని భారతదేశం భావిస్తున్న నేపథ్యంలో అందుకు తెలంగాణ వేదిక కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
82 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని ఇక్కడ నిర్మించబోతున్నామన్నారు రేవంత్ రెడ్డి. 2028 డిసెంబరులో ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం అని తెలిపారు.
'క్రీడారంగంలో స్పష్టమైన విధానం లేని కారణంగా క్రీడల్లో దేశం వెనుకబడిపోయింది. అందుకే తెలంగాణలో స్పష్టమైన క్రీడా పాలసీని తెచ్చాం. దేశంలో క్రీడా శిక్షణా కేంద్రాలు, యూనివర్సిటీలకు పాలసీ ఉండాలి. స్వాతంత్య్రోద్యమ కాలంలో యంగ్ ఇండియా పేరుతో మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా దినపత్రిక స్ఫూర్తిగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.' అని వివరించారు.
ఆఫ్రోఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు వేదికగా ఉన్న హైదరాబాద్ ఆ తర్వాత గడిచిన 20 ఏళ్లపాటు చెప్పుకోదగిన క్రీడలను నిర్వహించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 23 ఏళ్ల కిందట నిర్మించిన స్టేడియాలు ఆ తర్వాత పెళ్లిళ్లకు, రాజకీయ కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించారని చెప్పారు. వాటన్నింటినీ పునరుద్ధరించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.
'నిజమైన క్రీడాకారులను సంపూర్ణమైన ప్రోత్సాహకాలను అందించడానికి స్పోర్ట్స్ పాలసీతో పాటు పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యంలో క్రీడా యూనివర్సిటీని నెలకొల్పాం. ఇందులో ప్రభుత్వం జోక్యం ఉండదు సంజీవ్ గోయెంక, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, కావ్యా మారన్, ఉపాసన కొణిదెల, రవికాంత్ రెడ్డి లాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న వారితో యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ వర్సిటీ నిర్వహణ విషయంలో వారికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం.' అని తెలిపారు.
వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన ఆరుగురు క్రీడాకారులకు రూ. 7.15 కోట్ల మేరకు నగదు ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా వారికి అందించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నమెంట్స్, లీగ్స్ వివరాలను ఈ వేదికగా ప్రకటించారు. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (8వ ఎడిషన్) క్రీడలు, జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ టోర్నమెంట్స్‌ను తెలంగాణ నిర్వహించబోతోంది.
వీటితో పాటు హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “Telangana Sports Knowledge on Wheels” స్పోర్ట్స్ నాలెడ్జ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


