సూర్యాపేట జిల్లా పరిధిలో ఆదివారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి ఓ వైద్యుడు కారులోనే తీవ్రంగా దగ్ధమై ప్రాణాలు కోల్పోయారు.

బాధితుడు ఖమ్మం జిల్లా వైరాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన ప్రస్తుతం ఖమ్మంలోని ప్రముఖ మమత ఆసుపత్రిలో నాడీ వ్యవస్థ శస్త్రచికిత్స నిపుణుడిగా (న్యూరోసర్జన్) సేవలందిస్తున్నారు.
డివైడర్ ను ఢీకొట్టడంతో….
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ జగదీష్ హైదరాబాద్ నుంచి తన స్వస్థలమైన ఖమ్మం వైపు కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. ఆదివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో సూర్యాపేట పరిధిలోని 365వ జాతీయ రహదారిపైకి చేరుకోగానే, ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప గ్రిల్స్ (డివైడర్)ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు ఇంజన్ భాగంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు, మంటలు క్షణాల్లో కారు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉండటం, మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో ఆయన కారులోనే సజీవదహనమయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఒక్క ఫైర్ ఇంజిన్‌తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ, ఆలోపే కారు పూర్తిగా కాలి బూడిదైంది. అనంతరం పోలీసులు డాక్టర్ జగదీష్ భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.