కొత్తగా కారు కొనుగోలు చేశామన్న ఆనందం ఆ కుటుంబంలో కొద్దిసేపు కూడా నిలవలేదు. వాహనానికి పూజ చేయించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని ఆలయానికి వస్తే, ఊహించని ప్రమాదం కొంపముంచింది. మేనల్లుడు చేసిన చిన్న పొరపాటు కన్న సొంత మామ ప్రాణాలనే బలితీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయం ఆవరణలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన తుమ్ములపల్లి రామచంద్రరావు (70) తన భార్య గంగాభవానితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం వారు నగరంలోని మియాపూర్‌లో నివాసముంటున్న తమ మేనల్లుడు సాయికుమార్ ఇంట్లో ఉంటున్నారు. అయితే, సాయికుమార్ ఇటీవల ఒక కొత్త కారును కొనుగోలు చేశాడు. కారుకు శాస్త్రోక్తంగా పూజ చేయించాలని భావించిన సాయికుమార్, కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయానికి వెళ్లాడు.
ఆలయం వద్ద వాహన పూజ జరుగుతున్న సమయంలో, కారును కాస్త ముందుకు జరపాలని అర్చకుడు సాయికుమార్‌కు సూచించారు. దీంతో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సాయికుమార్ కారును ముందుకు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే…. కంగారులో లేదా తొందరపాటులో బ్రేక్ వేయడానికి బదులుగా ఒక్కసారిగా ఎక్సలేటర్‌ను గట్టిగా తొక్కేశాడు. దీంతో కారు తీవ్ర వేగంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది.
చికిత్స పొందుతూ కన్నుమూత
సరిగ్గా అదే సమయంలో కారుకు ముందు భాగంలో నిలబడి ఉన్న రామచంద్రరావును ఈ కారు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కిందపడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని, అత్యవసరంగా ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేర్చి వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మేనల్లుడు కొత్త కారు కొన్నాడన్న సంతోషంతో పూజకు వచ్చిన కుటుంబంలో, అదే కారు తగిలి మామ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
{{/usCountry}}ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మేనల్లుడు కొత్త కారు కొన్నాడన్న సంతోషంతో పూజకు వచ్చిన కుటుంబంలో, అదే కారు తగిలి మామ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
{{/usCountry}}