తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఓటరు హక్కును సాధించాలనుకునే యువతకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO Telangana) కార్యాలయం ఒక కీలక సమాచారాన్ని విడుదల చేసింది. 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న ప్రతి కొత్త ఓటరు కూడా ప్రస్తుతం ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది కాబట్టి…. అర్హులైన యువతీయువకులు ఎవరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పేరు నమోదు ఇలా….

18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం "ఫాం 6" (Form 6) ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫాం-6 దరఖాస్తుతో పాటు ఒక డిక్లరేషన్ ఫారాన్ని కూడా జతపరిచి ఎన్‌రోల్‌మెంట్ కోసం సమర్పించాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన ఖాళీ ఫారాలను మీ ప్రాంతంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) స్వయంగా ఉచితంగా అందిస్తారు. ఈ ప్రక్రియ అంతా నాలుగు సరళమైన దశల్లో పూర్తవుతుంది.
- దరఖాస్తు చేసుకునేందుకు ఓటరు వయసు 18 ఏళ్లు నిండి ఉండాలియ
- బీఎల్ఓ ఇచ్చిన ఫాం-6, డిక్లరేషన్ ఫారంలో అడిగిన వివరాలన్నింటినీ తప్పులు లేకుండా భర్తీ చేయాలి.
- పూర్తి చేసిన ఆయా దరఖాస్తు ఫారాలను తిరిగి మీ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) కే సమర్పించాల్సి ఉంటుంది.
- ఆ దరఖాస్తులను సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
- ఈ దరఖాస్తుల పరిశీలన కాలపరిమితిని కూడా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ క్లెయిమ్స్ మరియు అబ్జెక్షన్స్ పీరియడ్ లో భాగంగా పరిశీలిస్తారు.
- ఈ ప్రత్యేక పరిశీలన ప్రక్రియ 2026 జూలై 31 నుంచి 2026 ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది.
- అధికారులు మీ దరఖాస్తును ఆమోదించిన తర్వాత, కొత్త ఓటరు పేరు అధికారికంగా తుది ఓటరు జాబితాలో (Final Electoral Roll) చేర్చబడుతుంది.