తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని కళాశాలలకు వేసవి సెలవులను పొడిగించింది.
అధికారిక ఉత్తర్వు ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ సహాయం పొందే, అనుబంధ, అనుసంధానిత అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలకు సెలవును పొడిగించారు. ఈ నిర్ణయం ఉస్మానియా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కాన్‌స్టిట్యూయెంట్, అనుబంధ కళాశాలలకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మే 31తో సెలవులు ముగియాల్సి ఉండగా, తాజా ఆదేశాల ప్రకారం జూన్ 6, 2026 వరకు సెలవులను పొడిగించారు. జూన్ 7 ఆదివారం కావడంతో తిరిగి జూన్ 8వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ బాటలోనే రాష్ట్రంలోని మరికొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలకు కూడా జూన్ 6 వరకు సెలవులు పొడిగించారు. ఇవి కూడా జూన్ 8న తెరుచుకుంటాయి.
కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు పరిధిలోని కళాశాలలకు జూన్ 5 వరకు సెలవులు పొడిగించారు. ఇవి జూన్ 6వ తేదీన పునఃప్రారంభం అవుతాయి.
గత కొన్ని రోజులతో పోలిస్తే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ, వడగాల్పుల తీవ్రత మాత్రం తగ్గలేదు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మంలో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే, చార్మినార్ పరిధిలో అత్యధికంగా 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. పునఃప్రారంభ తేదీల్లో ఏవైనా మార్పులు ఉంటే సంబంధిత కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. పునఃప్రారంభ తేదీల్లో ఏవైనా మార్పులు ఉంటే సంబంధిత కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}