జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం.. 40.97 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు

తెలంగాణ ఆరోగ్య శాఖ జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సు గల సుమారు 40.97 లక్షల మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయనుంది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజ నరసింహ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Published on: Jun 27, 2026, 13:25:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పల్స్ పోలియో
పల్స్ పోలియో

ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించాలని స్పష్టం చేశారు మంత్రి. జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేయనున్నట్లు, జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి సూచించారు.

'ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సుమారు 40.97 లక్షల మంది 0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 52.04 లక్షల బీవోపీవీ (bOPV) టీకా డోసులు జిల్లాలకు సరఫరా చేశారు. కార్యక్రమంలో 8,393 ఏఎన్‌ఎంలు, 27,181 ఆశా కార్యకర్తలు, 34,442 అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.' అని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు.

వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

'జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో టీకా వేయించాలి. గతంలో పోలియో చుక్కలు వేయించినా మరోసారి వేయించడం వల్లే పూర్తి రక్షణ లభిస్తుంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి టీకా వేయించాలి. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరూ సహకరించి తెలంగాణ, దేశం పోలియో రహిత హోదాను కొనసాగిద్దాం.' అని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More