జీతం తగ్గినా పర్వాలేదు.. ఆరు రోజుల నరకం వద్దు బాబోయ్: హైదరాబాద్ ఇంజనీర్ ఆవేదన

హైదరాబాద్‌లోని ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలో పనిచేస్తున్న 25 ఏళ్ల మహిళా సివిల్ ఇంజనీర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. వారానికి ఆరు రోజుల పని భారం వల్ల మానసికంగా అలసిపోయానని, ఐదు రోజుల పని దినాల కోసం జీతం తగ్గించుకోవడానికైనా సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు.

Published on: Jun 27, 2026, 08:32:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్పొరేట్ కంపెనీల్లో పని గంటలు, పని దినాలపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక 25 ఏళ్ల మహిళా సివిల్ ఇంజనీర్ రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్న పోస్ట్ కార్పొరేట్ వర్గాల్లో సరికొత్త చర్చను లేవనెత్తింది. వారానికి ఆరు రోజుల పని భారం తనను మానసికంగా కుంగదీస్తోందని, దీని నుంచి విముక్తి లభిస్తే తక్కువ జీతానికైనా పనిచేయడానికి సిద్ధమని ఆమె ప్రకటించారు.

వారానికి ఆరు రోజుల పని భారం వల్ల మానసికంగా అలసిపోయానని, ఐదు రోజుల పని దినాల కోసం జీతం తగ్గించుకోవడానికైనా సిద్ధమేనని ఓ ఇంజినీర్ ఆవేదన
వారానికి ఆరు రోజుల పని భారం వల్ల మానసికంగా అలసిపోయానని, ఐదు రోజుల పని దినాల కోసం జీతం తగ్గించుకోవడానికైనా సిద్ధమేనని ఓ ఇంజినీర్ ఆవేదన

సదరు యువతి 2023లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక భారీ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో మిగతా ప్రపంచంలా ఐదు రోజుల పని సంస్కృతిని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ నిరంతర శ్రమ వల్ల కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి పూర్తిగా దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

'మేమేం యంత్రాలం కాదు'

"ఆరు రోజుల పని దినాల వల్ల నేను మానసికంగా తీవ్రంగా అలసిపోయాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కనీసం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, కుటుంబంతో గడపడానికి కూడా ఓపిక ఉండటం లేదు. ఇక ఆదివారం మొత్తం వారమంతా పడ్డ అలసట నుంచి కోలుకోవడానికే సరిపోతోంది. అది ఎలా గడిచిపోతుందో తెలిసేలోపే మళ్లీ సోమవారం వచ్చేస్తోంది" అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కంపెనీల లాభాల కోసం ఉద్యోగులను యంత్రాల్లా వాడుకోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

"ఎవరిదో సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మేమేం యంత్రాలం కాదు, మనుషులం. ఈ దోపిడీ ఎప్పుడు ఆగుతుంది? ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఐదు రోజుల పని దినాలను అమలు చేస్తున్నాయి" అని ఆమె వాపోయారు.

రూ. 23 వేల జీతం.. రూపాయి మిగలట్లేదు

దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకదానిలో పనిచేస్తున్నప్పటికీ, ఆమెకు వస్తున్న జీతం కేవలం రూ. 23,000 మాత్రమే. ఈ ఆరు రోజుల నరకం నుంచి తప్పించుకోవడానికి, కొత్త ఉద్యోగంలో అంతకంటే తక్కువ జీతం ఇచ్చినా చేరడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ఆమెకు కావల్సిందల్లా వారానికి రెండు రోజుల సెలవు (5-day work week) మాత్రమే.

నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన ఖర్చుల వివరాలను కూడా ఆమె పంచుకున్నారు.

"వచ్చే రూ. 23 వేల జీతంలో పొదుపు చేయడానికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. రూ.8,000 అద్దెకు పోగా, రూ.10,000 ఇంటికి పంపుతాను. మిగిలిన రూ.5,000 ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాలకు సరిపోతున్నాయి" అని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మద్దతు

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఆ యువతికి మద్దతుగా నిలుస్తున్నారు.

"ఈ దేశం నిన్ను గుర్తించడంలో విఫలమైంది. నీ నైపుణ్యానికి తగిన ఉద్యోగాన్ని వెతుక్కో లేదా విదేశాలకు వెళ్ళిపో" అని ఒకరు కామెంట్ చేశారు.

"రూ.23 వేల జీతానికి వారానికి ఆరు రోజులు పనిచేయించుకోవడం చాలా దారుణం. నీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను" అని మరొకరు రాసుకొచ్చారు.

ఇదే తరుణంలో ఐటీ రంగంలో ఉన్న మరొక ఉద్యోగి స్పందిస్తూ, తాను కూడా ఐటీలో వారానికి ఆరు రోజులు పనిచేస్తూ ఇలాంటి నరకాన్నే అనుభవిస్తున్నానని, త్వరలోనే నైపుణ్యాలు పెంచుకుని ఆ ఉద్యోగం మానేస్తానని తన బాధను పంచుకున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More